ఫోన్ లో సూర్యుడితో మాట్లాడాలట: చంద్రబాబుపై జగన్ సెటైర్లు

First Published May 23, 2018, 6:30 PM IST
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

గణపవరం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం గణపవరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 

ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఫోన్ లో సూర్యుడితో మాట్లాడి పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని చెబుతారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని చంద్రబాబు ఆదేశించినట్లు వచ్చిన వార్తలపై ఆయన ఆ విధంగా స్పందించారు.  

పివి సింధుకు షటిల్ తానే నేర్పించానని చంద్రబాబు చెబుతారని అన్నారు. సత్య నాదెళ్లకు, సింధుకు తానే స్ఫూర్తి అట అని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తాను స్వాతంత్ర్య పోరాటం చేశానని చంద్రబాబు చెబుతారని అన్నారు. అమరావతికి ఒలింపిక్స్ తెస్తానని చంద్రబాబు చెబుతారని అన్నారు. 

అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు స్పెషలిస్టు అని అన్నారు. తమ 23 మంది శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన చంద్రబాబుకు కర్ణాటకలో ప్రజాస్వామ్యం బతికిందని అనే అర్హత ఉందా అని చంద్రబాబు అడిగారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అన్నీ చేసేశానని చంద్రబాబు చెబుతారని, ఆ విషయమే చంద్రబాబు అనుకూల మీడియా రాస్తుందని అన్నారు. 

చిన్న చిన్న మోసాలు, అబద్ధాలను ప్రజలు నమ్మరు కాబట్టి ప్రతి ఇంటీకి కెజీ బంగారం, ఓ బెంజీ కారు ఇస్తానని చెబుతాడని, అలా కూడా నమ్మరని తెలిసి ప్రతి ఇంటికీ ఓ మనిషిని పంపించి మూడు వేల రూపాయలు చేతుల్లో పెడుతారని ఆయన అన్నారు. 

మూడు వేల రూపాయలు ఇస్తానంటే ఐదు వేల రూపాయలు లాగాలని, ఆ సొమ్మంతా మన జేబుల్లోంచి దోచుకుందేనని, డబ్బులు తీసుకోవాలని గానీ ఓటు మాత్రం మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని ఆయన అన్నారు.

చంద్రబాబు విదేశాలకు ప్రైవేట్ జెట్లలోనే వెళ్తారని, ఏ దేశానికి వెళ్తే ఆ దేశం పాట పాడుతారని అన్నారు. 

click me!