కొత్త పెళ్లికూతురు వైపు చూస్తుంటే చంద్రబాబుకు గుర్తొస్తాయి: జగన్

First Published May 23, 2018, 6:07 PM IST
Highlights

కొత్త పెళ్లి కూతురు కాంగ్రెసు వైపు చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా, కొల్లేరు సమస్య గుర్తుకు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు.

గణపవరం: కొత్త పెళ్లి కూతురు కాంగ్రెసు వైపు చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా, కొల్లేరు సమస్య గుర్తుకు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. బిజెపితో నాలుగేళ్లు కాపురం చేసినప్పుడు సమస్యలు గుర్తు రాలేదని ఆయన అన్నారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన బుధవారం గణపవరం బహిరంగ సభలో ప్రసంగించారు. 

బిజెపితో నాలుగేళ్లు కాపురం చేసినప్పుడు చంద్రబాబుకు కొల్లేరు సమస్య గుర్తు రాలేదని, ఎన్నికలు సమీపించగానే నెపం వేరేవాళ్ల మీద నెట్టడానికి బిజెపితో విడాకులు తీసుకున్నారని, విడాకులు తీసుకున్న తర్వాత ప్రత్యేక హోదా, కొల్లేరు సమస్య గుర్తుకు వస్తాయని ఆయన ధ్వజమెత్తారు. 

నాలుగేళ్ల పాటు తెలుగుదేశం ఎంపీలు బిజెపి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, బిజెపి ఎమ్మెల్యేలు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారని, నాలుగేళ్లు బిజెపితో సంసారం చేసినప్పుడు చంద్రబాబు ఏవీ గుర్తు రావని, చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని ఆయన అన్నారు. 

చేపలు, రొయ్యలు దళారుల చేతుల్లో చిక్కుకున్నాయని, రెండు లక్షల ఎకరాల్లో చేపలూ రొయ్యల చెరువులు ఉన్నాయని, ఆ  చెరువులకు నీళ్లు లేవని, సీడ్ లో నాణ్యత లేదని, పరీక్ష చేయించడానికి ల్యాబ్ లు లేవని ఆయన అన్నారు. కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ఉత్పత్తి ఎక్కువగా ఉంది, అమ్ముడు పోవడం కష్టంగా ఉందని ఆయన అన్నారు. 

రైతుల సమస్యలు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని చర్యలూ తీసుకుంటానని ఆయన చెప్పారు. మూడేళ్లలో సముద్ర తీరం వెంబడి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టిస్తానని, మద్దతు ధర ప్రకటిస్తానని ఆయన చెప్పారు. 

కొల్లేరు సమస్య సుప్రీంకోర్టులో ఉందని, దాన్ని పరిష్కరించడానికి చిత్తశుద్ధి అవసరమని, ఆ సమస్య పరిష్కారానికి ఈ ప్రాంతం నేతను ఎమ్మెల్సీగా చేసి, తన పక్కనే కూర్చోబెట్టుకుని సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం కొల్లేరు విషయంలో తప్పుడు రిపోర్టు ఇచ్చిందని, తాను అధికారంలోకి వస్తే రీసర్వే చేయించి, వీలైనన్ని ఎక్కువ ఎకరాల భూమిని బయటకు తీసుకుని వస్తానని వివరించారు. 

మంచినీటి సమస్య పరిష్కారానికి సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు పెట్టి, గోదావరీకృష్ణా జలాలను తరలిస్తానని హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్మించి ఇవ్వలేదని ఆయన అన్నారు. 

click me!