ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
also read:స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్: కలెక్టర్లతో నేడు నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్
ప్రజారోగ్యం కోసమే ఇన్నాళ్లు ఎన్నికలు వద్దనుకొన్నామని ఆయన చెప్పారు. ఎస్ఈసీ నిర్ణయించినట్టుగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఎలా వ్యవహరించాలనే దానిపై కేంద్రంతో ప్రభుత్వం చర్చిస్తోందని ఆయన తెలిపారు. రెండు ఏక కాలంలో ఎలా జరపాలనే దానిపై కేంద్రం సలహాను రాష్ట్రం తీసుకొంటుందని ఆయన చెప్పారు.
ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు.
పోలీసులు, ఉద్యోగులు రెండు కార్యక్రమాలపై ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. సగం ఆగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఆపి పంచాయితీ ఎన్నికలను ముందుకు తీసుకురావడం వెనుక దురుద్దేశ్యాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల్లో బలమైన పునాది ఉన్న పార్టీ తమదన్నారు. ఈ ఎన్నికలకు తాము వెనుకకు వెళ్లడం లేదన్నారు. అధికార పార్టీగా ఎప్పుడైనా ఎన్నికలకు సిద్దంగానే ఉన్నామని ఆయన ప్రకటించారు.ఉద్యోగుల ఆవేదనను ఎస్ఈసీ పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడ ఇదే ఇబ్బంది ఉంటుందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు రాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రానికి లేఖ రాయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఎన్నికల సంఘం కమిషనర్ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చట్టం, న్యాయానికి లోబడి పనిచేస్తుందన్నారు.