ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్వాగతించారు.
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్వాగతించారు.
వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతోన్న రాజ్యాంగ ఉల్లంఘనలు అన్నీఇన్నీ కావన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను సజావుగా పని చేయనీయకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చట్టసభలు, పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, మీడియా 4 మూల స్థంభాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
శాసన మండలి రద్దుకు బిల్లు, నిజాయితీగా పనిచేసే అధికారులకు వేధింపులు, న్యాయవ్యవస్థపై దాడి, న్యాయమూర్తులపై దుర్భాషలు, ఎన్నికల సంఘంపై దాడి, ఈసిని కులం పేరుతో దూషించడం, జీవో 2430ద్వారా మీడియాపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయడం, కోర్టు తీర్పులను కూడా అమలు చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల విచ్చిన్నమే అజెండాగా పెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు.
ప్రతి సందర్భంలోనూ కోర్టులే జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయమని ఆయన చెప్పారు. పంచాయితీ ఎన్నికలపై ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసిపి ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలన్నారు.
రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలన్నారు.నిష్పక్షపాతంగా, సజావుగా పంచాయితీ ఎన్నికలు జరపాలన్నారు.మార్చిలో స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు- అక్రమ నిర్బంధాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నామని చెప్పారు.