వైసిపి టిక్కెట్ కావాలా ? ఈ మూడు ఉండాల్సిందే

First Published Jan 3, 2018, 2:51 PM IST
Highlights
  • వచ్చే ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేయాలనుకున్న వారి విషయంలో నాయకత్వం మూడు అంశాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటోందట.

వచ్చే ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేయాలనుకున్న వారి విషయంలో నాయకత్వం మూడు అంశాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటోందట.  కాస్త అటు ఇటు అయినా మూడు అంశాల్లోనూ సంతృప్తి చెందిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోయిన ఎన్నికల్లో చివరి నిమిషంలో అభ్యర్ధులను ఖరారు చేయటం, సామాజికవర్గాల్లో తలెత్తిన కన్ఫ్యూజన్, డబ్బులు ఖర్చు చేయలేకపోవటంతో పాటు గెలిచేస్తామన్న నిర్లక్ష్యం వల్లే దెబ్బతిన్నట్లు నాయకత్వం ఇప్పటికే అభిప్రాయనికి వచ్చింది. అందుకే రాబోయే ఎన్నికల విషయంలో జగన్ జాగ్రత్తపడుతున్నారట.

ఇక, ప్రస్తుత విషయానికి వస్తే, ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపిక విషయంలో జగన్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లో 67 మంది ఎంఎల్ఏలు గెలిస్తే 23 మంది ఫిరాయించారు. మిగిలిన 44 మంది ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో వారి గెలుపోటములపై సర్వే చేయించారట. వారిలో చాలామందికి టిక్కెట్లు ఖాయమని సమాచారం.  ఇక, ఫిరాయింపుల నియోజకవర్గాలతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్లు ఖాయమైన వారు పోను మిగిలిన వారి విషయంలో మూడు అంశాలను గట్టిగా పరిశీలిస్తున్నారట.

                                                                                                                                                                                                ఆర్ధిక పరిస్దితి

 ఎంపిక చేయబోయే అభ్యర్ధుల ఆర్ధిక వనరులపై జగన్ పరిశీలన చేస్తున్నారట.  ఎందుకంటే, వచ్చే ఎన్నికలు రెండు పార్టీలకూ చాలా కీలకం. కాబట్టి గెలుపు విషయంలో డబ్బుకు వెనకాడకూడదన్నదే జగన్ ఉద్దేశ్యంగా కనబడుతోంది. పోయిన ఎన్నికల్లో కొంతమంది వైసిపి అభ్యర్ధులు ఈ విషయంలోనే దెబ్బ తిన్నారు.

                                                                                                                                                                                                  సామాజికవర్గం  

పోయిన ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికను హడావుడిగా చేయటంతో సామాజికవర్గాల సమతూకం పాటించలేకపోయారు. ఈలోపం ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో కనబడింది. అందుకనే ఈసారి నియోజకవర్గాలు, సామాజికవర్గాలపై  క్షుణ్ణంగా  సర్వే చేయిస్తున్నారు.

                                                                                                                                                                                                    గెలుపు గుర్రాలు

అభ్యర్ధుల ఎంపికలో ఎటువంటి మొహమాటాలకు తావు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి తనతో పాటు ఉన్న వారి విషయంలో కూడా మొహమాటానికి పోకూడదని నిర్ణించుకున్నారట. అటువంటి వారికి అధికారం వచ్చిన తర్వాత పదవులిచ్చి సర్దుబాటు చేయవచ్చన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.

ఎంపి, ఎంఎల్ఏ అభ్యర్ధులెవరైనా సరే పై మూడు అంశాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నది జగన్ ఆలోనగా చెబుతున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కాంట్రాక్టు కుదుర్చుకుని చాలాముందుగానే బాధ్యతలు అప్పగించిన కారణం కూడా ఇదేనట. మరి, చూడాలి జగన్ వ్యూహాలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో?

click me!