జగన్ కు చంద్రబాబు కౌంటర్

First Published Jan 3, 2018, 12:28 PM IST
Highlights
  • రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయం నడుస్తోంది.

రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత ఇద్దరూ జనాల్లోనే తిరుగుతున్నారు. కాకపోతే వారి దారులు మాత్రం వేర్వేరు. ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారపట్టటానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనాల్లో తిరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా మంగళవారం నుండి జనాల్లోకి బయలుదేరారు. మూడున్నరేళ్ళ తన ప్రభుత్వ ఘనతలను చెప్పుకోవటానికి చంద్రబాబు ‘జన్మభూమి-మనఊరు’ అనే కార్యక్రమాన్ని రూపొందించుకుని జనాల్లో తిరుగుతున్నారు.

చంద్రబాబు ఒక్కరే తిరిగితే సరిపోదు కదా? అందుకనే యావత్ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులను కూడా రంగంలోకి దింపారు. చూడబోతే జగన్ పాదయాత్రకు చంద్రబాబు కౌంటర్ ఎటాక్ లాగ కనబడుతోంది. జన్మభూమి కార్యక్రమం పేరుతో ప్రభుత్వం, పార్టీ మొత్తం 10 రోజుల పాటు జనాల్లోనే ఉంటారు. అయితే, ఇక్కడే చిన్న సమస్య తలెత్తింది. జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వ, పార్టీ పెద్దలు జనాలతో ముఖాముఖి కలవాలి. వారినుండి సమస్యలు తెలుసుకోవాలి. వాటి పరిష్కారాల కోసం ప్రయత్నించాలి.

ఉద్దేశ్యమైతే బాగానే ఉంది కదా? అయితే, కార్యక్రమం మంగళవారం మొదలైన దగ్గర నుండి చాలా చోట్ల గొడవలవుతున్నాయి. జనాలు ఎక్కడికక్కడ అధికారులు, పార్టీ నేతలపై తిరగబడుతున్నారు. ఎందుకలా? అంటే, పోయినసారి నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో తామిచ్చిన అర్జీల గురించి, సమస్యల పరిష్కారాల గురించి జనాలు నిలదీస్తున్నారు. అప్పుడెప్పుడో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు. మళ్ళీ సమస్యలు, అర్జీలంటూ ఎందుకొచ్చారంటూ నిలదీస్తున్నారు. దాంతో పార్టీ నేతలకు జనాలకు మధ్య గొడవలవుతున్నాయి.

మొత్తానికి జగన్ కు చంద్రబాబు ఇవ్వదలచుకున్న కౌంటర్ ఎటాక్ ఆలోచన బాగానే ఉంది కానీ క్షేత్రస్ధాయిలో ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో అనుమానమే. జగన్దేముంది ఎక్కడకుపోయినా ప్రభుత్వాన్ని, చంద్రబాబును విమర్శించటమే పని. అంతకన్నా జగన్ చేయగలిగేది కూడా ఏమీ లేదని జనాలకు కూడా తెలుసు. అయినా పాదయాత్రలో జనాల స్పందన అనూహ్యంగా ఉంటోంది. కానీ, ప్రభుత్వాధికారుల, నేతల పరిస్ధితి అలా కాదు కదా? మూడున్నరేళ్ళల్లో తామేం చేసామో జనాల్లోకెళ్ళి చెప్పుకోవాలి. సమస్య అంతా అక్కడే వస్తోంది. జన్మభూమి కార్యక్రమం పూర్తయ్యేనాటికి నేతల పరిస్ధితేంటో అర్ధం కాకుండా ఉంది.

click me!