విశాఖలో విషాదం.. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువ న్యాయవాది మృతి...

By SumaBala Bukka  |  First Published Jun 19, 2023, 9:09 AM IST

క్రికెట్ ఆడుతూ యువ న్యాయవాది చనిపోయిన విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. 


విశాఖపట్నం : విశాఖపట్నంలో జరిగిన న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంటులో విషాదం చోటు చేసుకుంది. అంతర్ జిల్లాల న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్లో ఆడుతూ న్యాయవాది గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 16వ తేదీ నుంచి విశాఖ నగరంలోని పలు స్టేడియంలో న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో మణికంఠ నాయుడు (26) అనే న్యాయవాది బి-టీం  తరఫున ఆడుతున్నాడు. అతను విశాఖ జగదాంబ కూడలి ప్రాంత నివాసి.  ఆదివారం గాజువాక జింక్  మైదానంలో మ్యాచ్ పూర్తయింది.  

ఆ తర్వాత మణికంఠ నాయుడు మైదానం నుంచి బయటికి వస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా అస్వస్థతకు గురై పడిపోయాడు. ఇది గమనించిన తోటి వారు ఎంత ప్రయత్నించినా అతనిలో చలనం కనిపించలేదు. వెంటనే 108  అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చి చూశారు. అతను అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. వెంటనే స్థానికుల సహాయంతో గాజువాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి అతని మృతదేహాన్ని తరలించారు.

Latest Videos

undefined

నీ పతనం ప్రారంభం : ద్వారంపూడి .. నీ సామ్రాజ్యం కూలుస్తా , లేదంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు

అయితే మణికంఠ నాయుడికి గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు తెలిపారు. ఈ కారణంగానే అతను మృతి చెందాడని అన్నారు. విశాఖపట్నంలో గత వారం రోజుల నుంచి ఎండ దంచి కొడుతుంది. 40 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవాదుల మధ్య మ్యాచులు నిర్వహించడం ఏంటని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా, బీహార్లో హృదయవిధారక ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణి భర్తను చూడడానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందింది. హత్యాయత్నం కేసులో ఓ వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఆయనను చూడడానికి వెళ్లిన  గర్భిణీ  అయిన అతని భార్య గుండెపోటుతో మృతి చెందడం బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. మృతురాలు పేరు పల్లవి. ఆమెకు గోవింద్ యాదవ్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా, గోవింద్ యాదవ్ ఏడు నెలల నుంచి  ఓ హత్యాయత్నం కేసులో జైలులో ఉన్నాడు. అప్పటికే గర్భిణీగా ఉన్న పల్లవి దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. 

ప్రసవం సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రసవానికి ముందు ఒకసారి భర్తను కలవాలనుకుంది. మంగళవారం నాడు జైలుకు వెళ్లింది. భర్తను చూసి కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకున్నారు.  అప్పటికే తీవ్ర మనస్థాపంతో ఉన్న పల్లవి భర్తను చూసిన తర్వాత మరింత భావోద్వేగానికి గురైంది. భర్తతో మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలబడిపోయింది. జైలు సిబ్బంది అది గమనించి, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

అయితే అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అక్కడికి వచ్చిన వారంతా ఈ విషయం తెలిసి.. కన్నీరు పెట్టారు. ఈ ఘటనతో వారి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. 

click me!