
అప్పుడెప్పుడో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన త్వరలో కార్యరూపం దాల్చనున్నదా? అవుననే అంటున్నాయి వైసిపి వర్గాలు. ఇంతకీ జగన్ చేసిన ప్రకటన ఏంటంటే ప్రత్యేకహోదా రాకపోతే తమ ఎంపిలు రాజీనామాలు చేస్తారని. రాజీనామాల అంశాన్ని జగన్ ప్రకటించి దాదాపు ఏడది అవుతోంది. ఇంత వరకూ మళ్ళీ రాజీనామాల అంశాన్ని జగన్ ప్రస్తావించలేదు. అప్పుడు చేసిన తొందరపాటు ప్రకటనే జగన్ ను బాగా వెంటాడుతోంది. తమది మడమ తిప్పని వంశమని తరచూ జగన్ చెప్పుకుంటున్న విషయం అందరూ వినేవుంటారు. సరిగ్గా చంద్రబాబునాయుడు కూడా ఆ విషయంపైనే జగన్ ను ఎన్నోసార్లు ఎగతాళి చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఇపుడా విషయంపైనే జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం నుండి మొదలుకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియగానే రాజీనామాల అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. ఎందుకంటే, ఏపికి ప్రత్యేకహోదా రావటమన్నది కలలోని మాటే. కేంద్రం ఎట్టి పరిస్దితుల్లోనూ ఇవ్వదని ఎప్పుడో తేలిపోయింది. అయితే, ప్రస్తుత సమావేశాల్లో అదే విషయాన్ని తేల్చేయాలని జగన్ తన పార్టీ ఎంపిలకు స్పష్టంగా ఆదేశించారట. కేంద్ర వైఖరి ఏమిటో తేలిపోతే తమ నిర్ణయం ఏదో తాము తీసుకుందామని జగన్ ఎంపిలతో స్పష్టంగా చెప్పారట.
ఇంకోవైపు ఇదే అంశంపై టిడిపి, భాజపా ఎంపిలు కూడా స్పీడవుతున్నాయి. మూడున్నరేళ్ళపాటు ప్రత్యేకహోదా అంశాన్ని గాలికొదిలేసిన మిత్రపక్షాలు పార్లమెంటు సాక్షిగా కొత్త నాటకానికి తెరలేపుతున్నాయి. దాంతో వైసిపి అప్రమత్తమైంది. నిజానికి ప్రత్యేకహోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, సదస్సలు నిర్వహించింది ఒక్క వైసిపి మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా ? అందుకనే మిత్రపక్షాలు నాటకాలు మొదలుపెడుతున్నాయి.
అయితే మిత్రపక్షాల నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే గతంలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని జగన్ అనుకున్నారట. అదే విషయాన్ని పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన పార్లమెంటరీ పార్టీలో కూడా చెప్పారట. అంటే శీతాకా సమావేశాల తర్వాత ఎప్పుడైనా ఎంపిల రాజీనామాల అంశాన్ని జగన్ ప్రకటించవచ్చని వైసిపి వర్గాలు చెప్పాయి. అదీకాకుండా సాధారణ ఎన్నికలకు ఉన్నది కూడా ఏడాదిన్నరే.
ప్రత్యేకహోదా డిమాండ్ తో తమ ఎంపిలు రాజీనామాలు చేస్తే రాష్ట్రం కోసం రాజీనామాలు చేసామని రేపటి ఎన్నికల్లో చెప్పుకోవచ్చన్నది వైసిపి వర్గాలు చెప్పాయి. అదే సమయంలో టిడిపి ఎంపిలను ఎండగట్టాలని కూడా జగన్ నిర్ణయించారు. మొత్తానికి వైసిపి ఎంపిలు గనుక రాజీనామాలు చేస్తే మిత్రపక్షాలు ఆత్మరక్షణలో పడటం ఖాయం.