చంద్రబాబు పై స్పీకర్ కు ఎంపి  ఫిర్యాదు

First Published Jan 5, 2018, 5:07 PM IST
Highlights
  • తన హక్కులకు, గౌరవానికి భంగం కలిగిందని కడప వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి పార్లమెంటు స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఫిర్యాదు చేసారు.

తన హక్కులకు, గౌరవానికి భంగం కలిగిందని కడప వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి పార్లమెంటు స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఫిర్యాదు చేసారు. మొన్నటి మూడో తేదీన జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో జన్మభూమి-మనఊరు కార్యక్రమం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కార్యక్రమంలో చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

అయితే, కార్యక్రమంలో అవినాష్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గురించి మాట్లాడ్డం మొదలుపెట్టగానే స్వయంగా చంద్రబాబే ఎంపి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబును చూసి మిగిలిన వాళ్ళు మరింతగా రెచ్చిపోయారు. అలా రెచ్చిపోయిన వారిలో ఓ రౌడీషీటర్ కూడా ఉన్నారు. అదే విషయంపై పార్లమెంటు స్పీకర్ కు ఎంపి ఫిర్యాదు చేసారు. చంద్రబాబుతో పాటు జిల్లా అధికారులు, పార్టీ నేతలు తన హక్కులకు, గౌరవానికి భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన చేతిలోని మైక్ ను లాగేసుకోవటం గౌరవానికి భంగం కలిగించటమే అని ఎంపి చెప్పారు.

జరిగిన ఘటన తాలూకు వార్తా పత్రికల కటింగులతో పాటు వీడియోకు సంబంధించిన యూట్యూబ్ లింకులను కూడా ఎంపి స్పీకర్ కు అంద చేశారు. అయితే, ఫలానా వారు అని ఎవరి పేరు చెప్పకుండానే తన హక్కులు, గౌరవానికి భంగం కలిగించిన వారందరిపైనా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఎంపి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

click me!