మంత్రులకు అవమానాలపై మంత్రివర్గంలో చర్చ ?

First Published Jan 5, 2018, 4:23 PM IST
Highlights
  • చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోని పలువురికి తీరని అవమానాలు ఎదురవుతున్నాయి.

చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోని పలువురికి తీరని అవమానాలు ఎదురవుతున్నాయి. అది కూడా అలాంటి ఇలాంటి అవమానాలు కాదు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు. రెగ్యులర్ గా జరుగుతునే ఉన్నాయి. శాఖలకు సంబంధించిన కార్యక్రమాలపై సంబంధిం శాఖల మంత్రులకే ప్రోటోకాల్ ప్రకారం సమాచారం అందటం లేదు. నిజంగా తీవ్రమైన అవమానాలే. మామూలుగా ఎక్కడైనా కానీ అధికారులు ప్రోటోకాల్ పాటించటం లేదని ప్రతిపక్షాలు గోలచేస్తుంటాయి. కానీ ఇక్కడ అధికార పార్టీ నేతలు కాదు ఏకంగా మంత్రులకే అవమానాలు జరుగుతున్నాయి. దాంతో ఏం చేయాలో ఎవరికీ అర్ధం కాక మంత్రులు తమలో తాము కుమిలిపోతున్నారు.

ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పరిస్ధితిలో మార్పు కనబడలేదు. అందుకు కారణాలేంటి? ఇపుడా విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు. సరే, ప్రోటోకాల్ ను ఎవరు ఉల్లంఘించినా బాధ్యత మాత్రం శాఖల్లోనే ఉన్నతాధికారులదే. ఐఏఎస్ అధికారులకు చంద్రబాబు ఇస్తున్న అపరమితమైన ప్రాధాన్యత వల్లే మంత్రులు అవమానాల పాలవ్వటానికి కారణంగా పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.

మొన్ననే జరిగిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ శంకుస్ధాపన కార్యక్రమానికి హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్పకే ప్రోటోకాల్ ప్రకారం ప్రకారం ఆహ్వనం అందలేదు. అంతుకుముందు ఓ విద్యాసంస్ధ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాఖ మంత్రి గంటా శ్రీనివసరావుని ఆహ్వానించనేలేదు. అదేవిధంగా, ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఏర్పాట్లపై ఆలయ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఆ సమావేశానికి శాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావును పిలవలేదు. అలాగే, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్  ప్రారంభించిన ఏపి ఫైబర్ నెట్ కార్యక్రమానికి కూడా పలువురు మంత్రులకు ఆహ్వానం అందలేదు. అందుకనే మంత్రుల అవమానాలపై త్వరలో జరగబోయే మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. చంద్రబాబు సమక్షంలో జరగబోయే చర్చలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

click me!