
మంత్రివర్గాన్ని ఉద్దేశించి వైసీపీ ఎంఎల్ఏ రోజా ఘాటు వ్యాఖ్యలు చేసారు. మంత్రివర్గంలో పనికిమాలిన వాళ్ళు, వానపాములున్నాయంటూ రోజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోంది. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలోకి వెళ్ళేముందు రాజీనామాలు కూడా చేయని వాళ్ళు పనికిమాలిన వాళ్ళని రోజా అన్నారు. దాంతో మంత్రివర్గంలో పనికిమాలిన వాళ్ళంటే ఎవరో అందరికీ అర్ధమైపోతుంది. వానపాములకు మంత్రిపదవులు ఇచ్చారని కూడా అన్నారు. మరి వానపాములు అని ఎవరిని ఉద్దేశించి అన్నారో మాత్రం స్పష్టం చేయలేదు.
తుందుర్రుకు వచ్చి ఇక్కడి బాధితుల గోడు వినేందుకు చంద్రబాబుకు తీరిక లేదా అంటూ నిలదీసారు. ఆక్వా ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నరసాపురం వైసీపీ ఎంఎల్ఏ ప్రసాదరాజు నిరాహారదీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన రోజా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తుందుర్రు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వంలోని వారికి వేల కోట్ల రూపాయల కమీషన్ ఇవ్వటంతోనే ప్రభుత్వం సమస్యను పట్టించుకోవటం లేదని కూడా ఆరోపించారు. సరే ఇవన్నీ రాజకీయపరమైన ఆరోపణలే అనుకోండి. ఇంతకీ రోజా చెప్పినట్లుగా మంత్రివర్గంలో ఉన్న వానపాములు ఎవరో?