
చంద్రబాబు నియమించింది గిరిజనుల సలహా మండలినా లేదా జన్మభూమి కమిటీ నా అని వైసీపీ నేతలు ప్రశ్నస్తున్నారు. సోమవారం చంద్రబాబు గిరిజనుల సలహా మండలిని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఆ మండలిలో ఎక్కవ మంది టీడీపీ నేతలను నియమిండం పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై వైసీపీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు బాలరాజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి విమానాల్లో తిరగడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. గిరిజనుల సంక్షేమానికి మాత్రం నిధులు లేవా అని బాలరాజు విమర్శించారు. గిరిజనులను మభ్యపెట్టేందుకే ఈ మండలిని ఏర్పాటు చేశారని ఆరోపించారు. గిరిజనులను చంద్రబాబు దగా చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన గ్రామాల్లో మంచినీటి వసతి, రోడ్ల సదుపాయం లేదని చెప్పారు. ఇప్పటికీ చాలాచోట్ల గిరిజనులు గుడిసెల్లోనే నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన సలహా మండలిలో గిరిజన ఎమ్మెల్యేలకు స్థానం లేకుండా చేశారని బాలరాజు ఆరోపించారు.ఎస్టీ సబ్ ప్లాన్ ను చంద్రబాబు తుంగలో తొక్కరని కాగ్ నివేదికలో వెల్లడైందని గుర్తుచేశారు.టీడీపీ మేనిఫెస్టోలో 50 ఏళ్లు నిండితే పెన్షన్లు ఇస్తామన్నారని.. ఇప్పటి వరకు ఎందుకు ఆచరణలో పెట్టలేదని ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్ఆర్ హయాంలో 32 లక్షల ఎకరాలు పంపిణీ చేయగా వాటిలో 26లక్షల ఎకరాలు ఎస్టీలకే పంపిణీ చేశారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఆనాడు వైఎస్ ఆర్ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారని.. పార్టీలకు అతీతంగా అందరికీ స్థానం కల్పించినట్లు తెలిపారు. కానీ చంద్రబాబు.. తమ పార్టీ నేతలకు మాత్రమే చోటు కల్పించారన్నారు.