
చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదమవుతోంది. తాజాగా ప్రభుత్వం నియమించిన గిరిజన సలహా మండలి నియామకంపై తీవ్రస్ధాయిలో విమర్శలు మొదలయ్యాయి. గడచిన మూడున్నరేళ్ళలో చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమైన విషయం అందరికీ తెలిసిందే. రాజధాని కోసం భూముల సేకరణ, అమరావతి డిజైన్లు కావచ్చు, అసెంబ్లీ నుండి వైసీపీ ఎంఎల్ఏ రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయటం...ఇలా అనేక అంశాలు వివాదాస్పదమయ్యాయి. సరే, ఎన్ని విమర్శలు వస్తున్నా చంద్రబాబు ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదనుకోండి అది వేరే సంగతి.
ఇంతకూ చంద్రబాబు నిర్ణయాలు ఎందుకంత వివాదాస్పదమవుతున్నాయి? 1995-2003 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా బ్యాలెన్స్ డుగా ఉండేవి. అటువంటిది మూడోసారి సిఎం అయిన తర్వాతే సమస్య మొదలైంది. వయసు పైబడటంతో పాటు పలువురి బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఎక్కువైపోయిందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంఎల్ఏలను టిడిపిలోకి లాక్కోవటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు నేతలు. పిరాయింపులను ప్రోత్సహించినందుకు తెలంగాణాలో కెసిఆర్ ను అమ్మనాబూతులు తిట్టి మళ్ళీ తాను కూడా అదే పని చేయటం గమనార్హం.
తాజాగా నియమించిన గిరిజన సలహా మండలి నియామకమే తీసుకుందాం. గడచిన మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలో గిరిజన సలహా మండలి భర్తీ చేయలేదు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి తదితరులు ఈ విషయమై పెద్ద పోరాటమే చేసారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఎందుకంటే టిడిపిలో గిరిజన ఎంఎల్ఏలు లేరు కాబట్టి. అందుకనే వైసీపీ ఎంఎల్ఏ కిడారు సర్వేశ్వర్రావును పార్టీలోకి లాక్కున్నారు. తీరా మూడున్నరేళ్ళ తర్వాత నియమించిన మండలి కాస్త వివాదాస్పదమైంది. మండలి ఏర్పాటుపై న్యాయపోరాటం చేస్తామని వైసీపీ ప్రకటించటం గమనార్హం.
మండలిలో సభ్యులుగా వైసీపీ ఎంఎల్ఏలు విశ్వసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, కె. సర్వేశ్వర్రావు, గిడ్డి ఈశ్వరి, వంతుల రాజేశ్వరి, ఎం శ్రీనివాసరావులున్నారు. నామినేటెడ్ సభ్యులుగా గుమ్మడి సంద్యారాణి, జనార్ధన్ థాట్రాజు, ఎం. మణికుమారి, కెపిఆర్కె ఫణీశ్వరి, ఎం. ధారూనాయక్, ఎం. జీవుల నాయక్, వి.రంగారావు ఉన్నారు. ఎంఎల్ఏలతో మాత్రమే భర్తీ చేయాల్సిన మండలిని మాజీ ఎంఎల్ఏలతో కూడా భర్తీ చేయటాన్ని వైసీపీ తప్పుపడుతోంది. మరి, తాజా వివాదాం ఏ మలుపులు తీసుకుంటుందో చూడాలి.