వృద్ధురాలి మెడలో గొలుసు దొంగతనం.. వైసీపీ నాయకుడు అరెస్ట్...

By SumaBala BukkaFirst Published Sep 24, 2022, 8:01 AM IST
Highlights

వృద్ధురాలి మెడలో గొలుసు దొంగిలించాడో వైసీపీ నేత. సీసీ ఫుటేజీతో అది వెలుగులోకి రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 

నెల్లూరు :  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ గాంధీనగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్న మస్తానమ్మ అనే వృద్ధురాలి మెడలో మూడున్నర సవర్ల బంగారు గొలుసు  గురువారం చోరీ అయింది. ఈ గొలుసును దొంగిలించిన వ్యక్తిని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ కార్యాలయంలో నిందితుడిని శుక్రవారం సిఐ సిహెచ్ కోటేశ్వరరావు విలేకరుల ఎదుట ప్రవేశ పెట్టారు. 

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గాంధీనగర్లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న మస్తానమ్మ మెడలో ఉన్న  బంగారు గొలుసును శాంతినగర్ కు చెందిన బెల్లం అనిల్ కుమార్ రెడ్డి దొంగిలించాడని వివరించారు. అతను వైసీపీ నాయకుడు. నగర పంచాయతీలో తాత్కాలిక శానిటరీ పర్యవేక్షకుడిగా పనిచేసి మానేశాడు. ఆటో యూనియన్  అధ్యక్షుడిగానూ పనిచేశాడు. ఇతని భార్య వాలంటీరు. ఈమె పింఛను ఇచ్చే సమయంలో తోడుగా వెళ్లేవాడు. ఆ సమయంలో పింఛన్ కోసం వచ్చిన వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు ఉండటం గమనించి.. గురువారం చోరీకి పాల్పడ్డాడు.  పోలీసీలు సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని  గుర్తించారు.

స్కూటీపై నుంచి జారీ పడ్డ చిన్నారి.. బిడ్డ కోసం దూకేసిన తల్లి, దూసుకొచ్చిన లారీ

ఇదిలా ఉండగా, పాత కక్షల నేపథ్యంలో జాతీయ రహదారిపై ఓ యువకుడిని లారీతో ఢీ కొట్టి కిరాతకంగా హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కడప గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూలగుంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పసుపులేటి రవితేజ(32) అక్కడికక్కడే మృతిచెందాడు. పార్టీలోని మరో వర్గంతో విభేదాలు దీనికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

రవితేజ, అతని మిత్రుడు ఉమా వేరు వేరు ద్విచక్రవాహనాలపై రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కనుమళ్లకు వస్తుండగా.. వెనక నుంచి లారీతో అతడిని ఢీకొట్టడంతో రోడ్డు మీద పడిపోయాడు. లారీ అతడిని తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతని మిత్రుడు ఉమా లారీని వెంబడించి ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అతని పైకి కూడా లారీని ఎక్కించ్చేందుకు డ్రైవర్ ప్రయత్నించగా కొద్దిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు.

రవితేజ మూలగుంటపాడులో ఉంటూ అక్కడే ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. సింగరాయకొండ మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో ఎంపీటీసీ సభ్యుడికి, రవితేజకు వివాదం ఉందని స్థానికులు తెలిపారు. హత్యకు అదే కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ హత్య తర్వాత గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒంగోలు నుంచి అదనపు బలగాలను రప్పించారు. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. రవితేజ తండ్రి శ్రీనివాసరావు సోమరాజుపల్లి మాజీ సర్పంచ్. 

click me!