పేర్లు మార్చడం కాదు... సమస్యలు తీర్చడంపై శ్రద్ధ పెట్టండి : జగన్‌కు పురందేశ్వరి చురకలు

By Siva KodatiFirst Published Sep 23, 2022, 4:08 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వానికి పేర్లు మార్చడంపై వున్న శ్రద్ద.. సమస్యలు తీర్చడంపై లేదని దుయ్యబట్టారు బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, భూకబ్జాలే కనిపిస్తున్నాయని ఆమె విమర్శలు గుప్పించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని.... ఏపీలో వున్న సమస్యలను తీర్చడంపై ఆయనకు శ్రద్ధ లేదని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్లను మార్చడంపై వున్న శ్రద్ద ప్రజా సమస్యలను పరిష్కరించడంపై లేదని ఆమె దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానన్న సీఎం.. ఆడపడుచులను మోసం చేశారని పురందేశ్వరి ఎద్దేవా చేశారు. ఏపీకి ఒక్క కొత్త పరిశ్రమ కూడా తీసుకురావడం లేదని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, భూకబ్జాలే కనిపిస్తున్నాయని ఆమె విమర్శలు గుప్పించారు. 

మరోవైపు... ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు పలు పార్టీలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కూడా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. అటు ఎన్టీఆర్ కుటుంబం కూడా ఘాటుగానే స్పందించింది. ఈ క్రమంలోనే గురువారం దగ్గుబాటి పురందేశ్వరి సైతం జగన్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. 

ALso REad:ఎన్టీఆర్ అంటే గౌరవముంటే.. ఇలాగేనా చేసేది : హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పురందేశ్వరి ఫైర్

నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్‌పై గౌరవం వుందని చెబుతూనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదన్నారు. రాష్ట్రంలో పేర్లు మార్చినా చాలా వరకు రామారావు ప్రవేశపెట్టిన పథకాలే అమలవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కారణం లేకుండా పేరు మార్చడం ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమేనని పురందేశ్వరి దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం లేదని మండిపడ్డారు. ఏ ప్రభుత్వంపైనా లేని కేసులు జగన్ సర్కార్‌పై వున్నాయని.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. 

ఇదిలావుండగా ఈ పరిణామంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని అన్నారు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరు పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని.. అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్నవారి జ్ఞాపకాలు చెరిపివేయలేరని అన్నారు. 
 

click me!