
సోషల్ మీడియాను ఒకవైపు ప్రభుత్వం దూరం చేసుకుంటుంటే ఇంకోవైపు వైసీపీ పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది.ఇందులో భాగంగానే పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ కు వైసీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. అలాగే, సోషల్ మీడియా పై పట్టు సాధించటంలో భాగంగానే సబ్ జైల్లో ఉన్న ఇంటూరిని పార్టీ ముఖ్య నేతలు వెళ్లి కలిసారు. గుంటూరు సబ్ జైల్లో ఉన్న ఇంటూరిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ సన్నిహితుడైన వి. విజయసాయిరెడ్డి పరామర్శించారు.
రాజకీయ కక్షసాధిపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం రవికిరణ్ ను అరెస్టు చేయించిందని మండిపడ్డారు. ఇంటూరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టటం దారుణమన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక కార్టూన్లు పెరుగుతున్నాయంటే జనాల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.
తమపై టిడిపి తరపున ఎంతో మంది కార్టూన్లు వేసారని, అప్పట్లో తాము చేసిన ఫిర్యాదుపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసారు. పేపర్లలో, సోషల్ మీడియాలో కార్టూన్లు సహజమన్నారు. కొందరు పోలీసు అధికారులు కూడా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నట్లు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులను ఎత్తేయటమే కాకుండా కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించటం గమనార్హం.