
అక్టోబర్ 27వ తేదీ నుండి చేద్దామనుకున్న మహాపాదయాత్రకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయాన్నిసిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆరుమాసాల పాటు చేయాలనుకున్న పాదయాత్రకు కోర్టు రూపంలో అడ్డంకులు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కదా? అంటే, పాదయాత్ర వద్దని కోర్టేమీ చెప్పలేదు. కాకపోతే ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్ళి హాజరేసుకోవాలి. పాదయాత్రకు ఆ ఒక్కటే పెద్ద ఆటంకంగా తయారైంది. ఒకసారి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మధ్యలో కోర్టుకు వెళ్ళటమంటే ఎంతైనా ఇబ్బందే. అధికార పార్టీ చూస్తూ ఊరుకోదు కదా? అందుకే జగన్ ప్రత్యమ్నాయాన్ని సిద్దం చేసుకున్నారట.
ఇంతకీ అదేంటంటే ‘‘జిల్లాల యాత్ర’’ చేయటం. ప్రతీ వారంలో నాలుగు రోజుల పాటు ఒక్కో జిల్లాలో తిరగటం. మహాపాదయాత్రకు, జిల్లాల యాత్రకు కొద్దిగా తేడా ఉన్నా ప్రస్తుత పరిస్ధితిల్లో అంతకు తప్ప వేరే గత్యంతరం కూడా లేదు. ఎందుకంటే, ఆమధ్య విశాఖపట్నంలో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో పాదయాత్ర గురించి జగన్ అట్టహాసంగా ప్రకటించేసారు మరి. అసలు తప్పంతా జగన్ దే. ఏదైనా భారీ కార్యక్రమం పెట్టుకునే ముందే కోర్టులు, కేసులు లాంటి వాటి గురించి న్యాయ నిపుణులతోను, సీనియర్ నేతలతోనూ చర్చించాల్సింది. అదేమీ చేయకుండా నిర్ణయం తీసుకుని ప్రకటించేసారు. ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు అన్నీసార్లు పనికిరావన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి.
ఒకసారి బహిరంగంగా ప్రకటించేసిన తర్వాత మడమ తిప్పితే ఏం బాగుంటుంది? అందుకనే మధ్యే మార్గంగా జిల్లాలయాత్రను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు అన్నీ జిల్లాల పార్టీల ముఖ్య నేతలకు కబురు కూడా వెళ్ళిపోయిందట. తేదీలో కూడా కొద్దిగా మార్పుండచ్చని అంటున్నారు. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 27 కాకుండా నవంబర్ మొదటివారం నుండి ప్రారంభం కావచ్చచంటున్నారు. సరే, ఇది కూడా ఒకందుకు మంచిదేనని పార్టీ నేతలు సర్దుకుంటున్నారు.
జిల్లాలయాత్రకు తగ్గట్లుగా రూట్ మ్యాప్ సిద్దమవుతోందట. ఏ జిల్లా నుండి మొదలుపెట్టాలి? ఏ రోజు ఏ నియోజకవర్గంలో తిరగాలి? ఎవరెవరు జగన్ తో నడవాలి? పాదయాత్ర సందర్భంగా జిల్లా స్ధాయిల్లో స్ధానిక నేతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలు కూడా జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి ప్రత్యామ్నాయ జిల్లాలయాత్రలైనా వర్కవుట్ అవుతుందో లేదో?