ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రోజు రోజుకు తన విమర్శల దాడిని పెంచుతున్నారు.
కడప: సాక్షి మీడియాలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ఎంత భాగం ఉందో తనకు కూడా అంతే భాగం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ప్రకటించారు. ఈ విషయాన్ని తన తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారని ఆమె గుర్తు చేశారు. ఏ పత్రికలో తనకు సమానవాటా ఉందో అదే సాక్షి మీడియాను వాడుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వై.ఎస్. షర్మిల ఆరోపించారు.
కడప జిల్లాలో సోమవారంనాడు వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఆమె పలు అంశాలపై ప్రసంగించారు.ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం ఉందా అని షర్మిల ప్రశ్నించారు. ఇవాళ వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా గురించి ప్రశ్నిస్తుంటే తనపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారని షర్మిల ఆరోపించారు.
also read:జగన్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్: 2019 రికార్డు పునరావృతం చేస్తారా?
జమ్మలమడుగులో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన ఆసుపత్రిలోనే తాను కూడ పుట్టినట్టుగా ఆమె గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మారిపోయాడన్నారు. తన కుటుంబాన్ని వదిలిపెట్టి వైఎస్ఆర్‌సీపీ, జగన్ కోసం పాదయాత్ర చేసినట్టుగా షర్మిల ప్రస్తావించారు. ఆనాడు 3,200 కి.మీ. పాదయాత్ర చేసినట్టుగా చెప్పారు. సమైక్యాంధ్ర కోసం యాత్ర చేయాలంటే చేశానన్నారు. బైబై బాబు అంటూ క్యాంపెయిన్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర కూడ చేశానన్నారు.
వైఎస్ఆర్‌సీపీకి తాను ఇంత మేలు చేసినా కూడ తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాము ఏం పదవులు తీసుకున్నామని ఆమె ప్రశ్నించారు.
also read:రాజోలు, రాజానగరంలలో పోటీ: పవన్ నిర్ణయం వెనుక కారణమిదీ..
తన భర్త అనిల్ సోనియా గాంధీ వద్దకు వెళ్లి షర్మిలకు సీఎం పదవి ఇవ్వాలని కోరారని ఓ వైఎస్ఆర్‌సీపీ నేత నిన్న చెప్పారన్నారు. ఈ విషయమై వాస్తవాలు చెప్పేందుకు ప్రణబ్ ముఖర్జీ బతికిలేరన్నారు. భారతిరెడ్డితో కలిసి తన భర్త అనిల్ సోనియా గాంధీ వద్దకు వెళ్లారని వై.ఎస్. షర్మిల గుర్తు చేశారు.వై.ఎస్. భారతి రెడ్డి ముందు తన భర్త అనిల్ అడిగాడా, లేదా వై.ఎస్. భారతి రెడ్డి వెనుక ఈ విషయాన్ని తన భర్త అనిల్ అడిగాడా అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయమై ప్రణబ్ ముఖర్జీ కొడుకును అడగాలన్నారు.