కొద్ది గంటల్లో అనిశ్చితికి తెర ?

First Published Feb 14, 2017, 3:20 AM IST
Highlights

శశికళపై ఉన్న ఆదాయానికి మించి ఆస్తుల కేసుపై మరి కొద్ది గంటల్లో సుప్రింకోర్టు తీర్పు రానుంది.

తమిళనాడు ముఖ్యమంత్రి  ఎవరనే విషయంలో ఈ రోజు తేలిపోతుందా? పది రోజుల రాజకీయ అనిశ్చితికి తెరపడుతుందా? అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. ‘పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తేల్చింద’న్నట్లు శశికళ-పన్నీర్ వర్గాల వివాదం సుప్రింకోర్టు తీర్చే అవకాశం ఉంది. శశికళపై ఉన్న ఆదాయానికి మించి ఆస్తుల కేసుపై మరి కొద్ది గంటల్లో సుప్రింకోర్టు తీర్పు రానుంది. తీర్పు ఎలా వుండబోతోందన్న టెన్షన్ మొదలవ్వటంతో ముందుజాగ్రత్తగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

 

పది రోజుల క్రితం శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ ఏఐఏడిఎంకె ఎంఎల్ఏలు ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. దాంతో చిన్నమ్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. అయితే, గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అడ్డుపడ్డారు. సుప్రింకోర్టులో కేసులు, తీర్పులంటూ అడ్డంపడకపోతే శశికళ సిఎం అయి దాదాపు పదిరోజులయ్యుండేది. శశికళను సిఎం కానీయకూడదన్న ఉద్దేశ్యంతోనే కేంద్రం గవర్నర్ ముసుగులో నాటకాలాడిస్తోంది.

 

ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకటిః శశికళకు వ్యతిరేకంగా ఎన్ని శక్తులు ఏకమైనా ఎంఎల్ఏల మద్దతును తగ్గించలేకపోయారు. అధికారికంగా ఆమెకున్న ఎంఎల్ఏల బలం నిన్నటికి 115. రెండోదిః ఎంత కాలం సాగదీసినా పన్నీర్ సెల్వంకు అవసరమైన బలం రాకపోవటం. పన్నీర్ బలం 8 మంది ఎంఎల్ఏలే. 234 శాసనసభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎంఎల్ఏల మద్దతుండాలి. ప్రస్తుత లెక్కల ప్రకారం ఇద్దరికీ బలం లేదు. మొన్నటి వరకూ పన్నీర్ కే తమ మద్దతని చెప్పిన డిఎంకె నేత స్టాలిన్ తాజాగా ప్లేట్ ఫిరాయించటంతో పన్నీర్ కు సిఎం అయ్యే అవకాశాలు లేనట్లే. ఇంకోవైపు శశికళ-పన్నీర్ వర్గాలకు చెందిన పలువురు ఎంఎల్ఏలు డిఎంకె వైపు చూస్తున్నారనే ప్రచారం ఊపందుకున్నది. దాంతో రాజకీయమంతా గందరగోళంగా తయారైంది.

 

ఈ నేపధ్యంలో మరికొన్ని గంటల్లో శశికళపై ఉన్న కేసులకు సంబంధించి తీర్పును సుప్రింకోర్టు రాబోతోంది. ఒకవేళ శశికళకు వ్యతిరేకంగా తీర్పుంటే మళ్ళీ అప్పీల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పటి వరకూ సిఎం బాధ్యతలు స్వీకరించే అవకాశాలైతే లేవు. కాబట్టి ఎవరో ఒకరిని సిఎంగా శశికళ కూర్చోబెట్టవచ్చు. ఈ కేసులు తేలేది కాదు, చిన్నమ్మ సిఎం అయ్యేది లేదని ఎంఎల్ఏలనుకుంటే ఒక్కసారిగా అందరూ పన్నీర్ గూటికి చేరుకోనూ వచ్చు. ఇదంతా శశికళ సామర్ధ్యం మీద ఆధారపడివుంది. పైగా ఇద్దరికీ దూరంగా కనీసం 25 మంది ఎంఎల్ఏలున్నారు. తీర్పు తర్వాత వారు గనుక పన్నీర్ కు జై కొడితే ఆయన బలం పెరుగుతుంది. అప్పుడు మిగిలిన ఎంఎల్ఏల్లో ఎంతమంది శశికళ వైపుంటారో చూడాలి.

click me!