
నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సులోచన కూడా తన పదవికి రాజానీమా చేయనున్నారా? నంద్యాల పట్టణంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. శిల్పా మోహన్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. శిల్పాతో పాటు ఆయన వర్గమైన మున్సిపల్ ఛైర్ పర్సన్ సులోచనతో పాటు 24 మంది కౌన్సిలర్లు కూడా టిడిపికి రాజీనామా చేసి వైసీపీలోకి జంప్ అయ్యారు. అయితే, వారెవ్వరూ ఛైర్ పర్సన్ , కౌన్సిలర్ల స్ధానాలకు రాజీనామాలు చేయలేదు.
ఎప్పుడైతే వారు పార్టీ మారారో వారి చేత పదవులకు కూడా రాజీనామాలు చేయించేందుకు టిడిపి బాగా ఒత్తిడిపెట్టింది. అయితే, వారెవరు కూడా ఒత్తిడికి లొంగలేదు. దాంతో చేసేది లేక వదిలేసారు. అయితే, ఇటీవలే ఎంఎల్సీ చక్రపాణిరెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు కదా. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం చక్రపాణిరెడ్డి పార్టీతో పాటు ఎంఎల్సీకి కూడా రాజీనామా చేసేసారు. దాంతో వైసీపీకి బాగా మైలేజ్ వచ్చింది. అదే సమయంలో రాజీనామాలు చేయకుండానే టిడిపిలో కొనసాగుతున్న ఎంఎల్ఏల వైఖరిపైనా చర్చ జరిగింది.
ఇపుడు అదే విషయమై వైసీపీలో చర్చ జరుగుతోందట. రాజీనామా చేయకుండా పదవుల్లో కొనసాగుతున్న ఛైర్ పర్సన్, కౌన్సిలర్లతో కూడా రాజీనామాలు చేయించేస్తే ఎలాగుంటుందని తాజాగా వైసీపీ యోచిస్తోంది. ఇదే విషయమై చర్చించేందుకు చక్రపాణి రెడ్డితో ఛైర్ పర్సన్, కౌన్సిలర్లు, నేతలు సమావేశమైనట్లు సమాచారం. ఒకవేళ వీరు గనుక రాజీనామాలు చేస్తే ఈ విధంగా కూడా టిడిపిపై నైతికంగా ఒత్తిడి పెరగటం ఖాయం. ఫిరాయింపుల రాజీనామాలపై మరోసారి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో వైసీపీకి కావాల్సింది కూడా అదే. ఒకవైపు జగన్, ఇంకోవైపు చంద్రబాబునాయుడులు నంద్యాలలోనే బస చేస్తున్న సమయంలోనే నైతిక అంశాలపై ఎవరైనా జనాలు ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఇబ్బంది తప్పదు.