పవన్ నటించినా.. సంపూర్ణేష్ నటించినా ఒకటే..: జనసేనానిపై మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఎటాక్

By telugu teamFirst Published Sep 26, 2021, 1:42 PM IST
Highlights

సినిమా టికెట్లకు ఆన్‌లైన్ పోర్టల్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఎటాక్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం ఒకటేనని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమను తమ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని, అది పవన్ కళ్యాణ్ క్రియేషన్ అని మండిపడ్డారు. ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకంట భయమని, అది సినీ ప్రముఖల ప్రతిపాదనే అని వివరించారు.
 

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం? అని పీకేను ప్రశ్నించారు. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకుంటోందని జగన్ ప్రభుత్వం యోచిస్తున్నది. దీనిపై పవన్ కళ్యాణ్ విమర్శనాత్మకంగా మాట్లాడారు. ఏపీ సర్కారు కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్నదని జనసేనాని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఎటాక్ చేశారు.

పవన్ కళ్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం అనేది ఒకటేనని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. అసలు ఆన్‌లైన్ పోర్టల్ గురించి చిత్ర పరిశ్రలోని ప్రముఖులే ప్రభుత్వం ముందకు తెచ్చారని, ప్రభుత్వ పెద్దలతో చర్చించారని వివరించారు. అయినా, ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయమని అడిగారు. దాని వల్ల జరిగే నష్టమేంటని ప్రశ్నించారు. దేనికైనా జవాబుదారీతనం ఉండాలన్నదే సీఎం ఆలోచని అని, ఆ ఉద్దేశంలోనే ఆన్‌లైన్ పోర్టల్ ఆలోచనను చూడాలని చెప్పారు. పారదర్శకత కోసమే ఈ పోర్టల్ అని వివరించారు. టికెట్ ధరలు అందరికీ ఒకేలా ఉండాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు. సినిమాకు పెట్టే ఖర్చులో నలుగురైదురికే లబ్ది ఎక్కువగా ఉంటున్నదని అన్నారు. ఇది ఎంత వరకు సబబు అని అడిగారు.

పవన్ కళ్యాణ్ మాటలు అభ్యంతరకరమని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. తనను టార్గెట్ చేయడానికి చిత్రిపరిశ్రమను ఇబ్బంది పెడుతున్నట్టు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ కల్పనేనని విమర్శించారు. చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయ ఉనికి కోసం జగన్‌ను తిట్టడం పవన్ కళ్యాణ్‌కు ఫ్యాషన్ అయిందని విమర్శించారు. ప్రభుత్వ తీరును మారుస్తారని, తాను రోడ్డుపైకి వస్తే మనిషి కాదని, బెండు తీస్తారనే మాటలు ఆయన తరుచూ మాట్లాడుతున్నారని అన్నారు. రెండు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకే ఆయన తమ అడుగులు అంటున్నాడని వివరించారు. ఇంకా స్థానాలు పెరిగే లోపే ఆ పార్టీని చాపచుట్టేయడం ఖాయమని అన్నారు.

click me!