
కాకినాడ : తల్లి ప్రేమ చిన్నారులకే కాదు ఆ తల్లులను కూడా బతికిస్తోంది. తల్లి.. పిల్లల కోసం మృత్యువుతో కూడా పోరాడుతుంది. తన ప్రాణాల్ని ఫణంగా పెట్టడానికైనా సిద్ధపడుతుంది. అలాంటి ఓ ఘటన కాకినాడలోని రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. బ్రెయిన్టెడ్ గా మారిన ఓ యువతి.. తన రెండేళ్ల కుమారుడు అమ్మ అనే పిలుపుకు స్పందించింది. దాదాపుగా 40 శాతం కోలుకుంది. కానీ అంతలోనే మృత్యువు ఆమెను కబళించింది. కంటతడి పెట్టించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే…
ఓ మహిళ యాక్సిడెంట్తో బ్రెయిన్ డెడ్ అయి జీవచ్ఛవంలా మారిపోయింది. కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది. ఆమె రెండేళ్ల కుమారుడు ‘అమ్మా.. అమ్మా..’ అంటూ పదేపదే పిలవడంతో ఆమెలో కాస్త చలనం వచ్చింది. ఇది చూసిన కుటుంబసభ్యులు, వైద్యులకు ఆమె బతుకుతుంది అన్న ఆశ చిగురించింది. ఆ దిశగా వైద్యం చేయగా ఆమె 40% కోలుకుంది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ మళ్ళీ మృత్యువు ఆమెను పలకరించింది.
ప్రేమ వివాదం: విజయవాడలో యువతి మేనమామ హత్య
అనపర్తి వీర వెంకట కనకదుర్గ అఖిల అనే మహిళ కాకినాడ జిల్లా అన్నవరం ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పని చేస్తుంది. తన తోటి ఉపాధ్యాయులతో కలిసి ‘సంకల్పం’ అనే పేరుతో స్వచ్చంద సేవలు చేస్తుండేవారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో గత శనివారం 10వ తరగతి చివరి పరీక్షల విధులకు హాజరై అఖిల తన టూ వీలర్ మీద తిరిగి వస్తుంది. కత్తిపూడి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె వస్తున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్ రూట్లో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.
దీంతో ఆమె తీవ్ర గాయాల పాలయ్యింది. యాక్సిడెంట్ గమనించినవారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్డెడ్ అని తెలిపారు. అయితే, అఖిల అంతకుముందే అవయవ దానానికి ఒప్పుకుని ఉండడంతో… ఇక ఆమె పరిస్థితి కోలుకోవడం కష్టమని అవయవదానానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆమెను ఆపరేషన్ థియేటర్కు తీసుకు వెళ్తున్నారు. ఆ సమయంలో అఖిల కొద్దిగా చేయి కదిపింది. దీంతో అందరిలోనూ ఆశలు చిగురించి.. ఆమె రెండేళ్ల కొడుకును తల్లి దగ్గరికి తీసుకువచ్చి.. అమ్మ అంటూ పిలిపించారు.
దానికి అఖిల మరోసారి స్పందించి చేయి కదిపింది. అది చూసిన కుటుంబ సభ్యులు, వైద్యులు ఆమె కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే అవయవ దానాన్ని నిలిపివేసి ఆమెకు చికిత్స అందించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అఖిల 40 శాతం వరకు కోలుకుంది. ఇక పూర్తిగా కోలుకొని తిరిగి మామూలు అవుతుందనుకున్న సమయంలో.. బుధవారం పరిస్థితి విషమించింది. ఆమె మృతి చెందింది.