
గుంటూరు: వివాహేతర (extramarital affair), అక్రమ సంబంధాలు (illegal affair) సంసారాలను నాశనం చేస్తూ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయినా కొద్ది క్షణాల శారీరక సుఖం కోసం బరితెగించే వారు మాత్రం తగ్గడం లేదు. మరీ దారుణం ఏంటంటే ఈ అక్రమ సంబందాల కారణంగా భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం వంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇలా తన అక్రమబంధానికి అడ్డుపడుతున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిందో కసాయి భార్య. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా (guntur district) నగరం మండల కాసానివారిపాలెం గ్రామానికి చెందిన కర్రి వెంకటేశ్వర రావు(37), ఆదిలక్ష్మి(30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఇలా పిల్లా పాపలతో ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో అక్రమ సంబంధం చిచ్చుపెట్టింది.
వ్యవసాయ పనులకు వెళ్లే ఆదిలక్ష్మికి బాపట్ల మండలం మూలపాలెం గ్రామనికి చెందిన బెజ్జం రాజేష్(27) తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా అక్రమసంబంధానికి దారితీసింది. అయితే వీరిమధ్య సాగుతున్న అక్రమసంబంధం గురించి వెంకటేశ్వరరావుకు తెలిసి ఇద్దరినీ తీవ్రంగా మందలించాడు. దీంతో అతడి అడ్డు తొలగించుకోవాలని ఆదిలక్ష్మితో పాటు ఆమె ప్రియుడు ప్లాన్ వేసారు.
Video
ఇందులో భాగంగా కృష్ణా జిల్లా పామర్రు నుంచి నెల రోజుల క్రితమే కొంగల మందును తీసుకువచ్చాయి. ఈ నెల(పిబ్రవరి) 8వ తేదీన రాత్రి వెంకటేశ్వర రావు తినే ఆహారంలో ఈ కొంగలమందు కలిపింది భార్య. ఎలాంటి అనుమానం రాకుండా ఈ విషం కలిపిన భోజనాన్ని భర్తతో తినిపించింది. ఇలా విషాహారం తిని భర్త మృతిచెందిన తర్వాత ప్రియుడు రాజేష్ కు సమాచారం ఇచ్చింది.
ప్రియురాలి ఇంటికి చేరుకున్న రాజేష్ మృతదేహాన్ని మాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రియురాలితో కలిసి ఇంటివెనకాల పశువులపాకలో గొయ్యి తవ్వి వెంకటేశ్వరావు మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తర్వాత తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరించారు.
అయితే వెంకటేశ్వరరావు కనిపించకపోవడంతో అతడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో అతడి భార్య ఆదిలక్ష్మిని భర్త ఆచూకీ గురించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆమె గురించి ఆరా తీయగా రాజేష్ తో అక్రమసంబంధం వ్యవహారం బయటపడింది. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా ప్రియురాలితో కలిసి చేసిన దారుణం గురించి బయటపెట్టాడు.
వెంటనే పోలీసులు వెంకటేశ్వరరావు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం అతడి భార్య ఆదిలక్ష్మిని అరెస్ట్ చేసారు. ఆమె నుండి కూడా హత్యకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ వివరాలను తాజాగా బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.
ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని డిఎస్సీ ఆందోళన వ్యక్తం చేసారు. తండ్రి మృతి, తల్లి జైలుకెళ్లడంతో వీరి ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారని... వీరి పరిస్థితి ఏమిటి, వాళ్ళను చూస్తే చాలా బాధాకరంగా ఉందని డిఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.