
వచ్చే ఎన్నికల్లో కేవలం ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్ధులను పోటీలోకి దింపాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యోచిస్తున్నారా? ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నది నిజమే అయితే, రాష్ట్రమంతటా పవన్ అభ్యర్ధులను పెట్టటం లేదు. ఏ ఏ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను పోటిచేయించాలనే విషయంలో పవన్ కాస్త జాగ్రత్తగానే పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లోనూ పోటీ చేయాలని అనుకుంటున్నా కేవలం ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసే విషయమై పవన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
పోటీ చేసే నియోజకవర్గాలను ఎంపిక చేసే విషయంలో పవన్ కొన్ని అంశాలను ప్రాతిపదకగా తీసుకుంటున్నారు. సామాజిక వర్గం ఓట్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నయి, అభివృద్ధిలో వెనుకబడిన నియోజకవర్గాలు, అధికార-ప్రతిపక్షాల్లో కుమ్ములాటలు ఎక్కువగా ఉన్న నియోకవర్గాలు, యువత ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలేవి, విద్యాసంస్ధలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై పవన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే, అధికార, ప్రతిపక్ష నేతలపై ఆయా నియోజకవర్గ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయన్న విషయంలో కూడా పవన్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ఆర్ధిక వనరులను కూడా పవన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
పనిలో పనిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పనితీరుపైన కూడా పవన్ సర్వే చేయిస్తున్నారని చెబుతున్నారు. ఓటర్ల మనోగతాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో పవన్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మొత్తం మీద ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే జనసేనను పోటీ చేయించాలన్న పవన్ యోచనతో చంద్రబాబు, జగన్ లో ఎవరు ఎక్కువగా నష్టపోతారనే విషయంలో ఆయా పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పవన్ కల్యాణ్ ఇంకెటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేక వామపక్షాలను కూడా కలుపుకుని వెళతారా అన్న విషయాల్లో ఇప్పటికైతే స్పష్టత రాలేదు.