
హిందుపురం నియోజకవర్గంలో గడచిన రెండున్నరేళ్లలో తన పిఏ శేఖర్ నిర్వాకాలేమీ బాలకృష్ణకు తెలీనే తెలీదట. అది నిజ్జమని అందరూ నమ్మాలట. జనాల చెవుల్లో బాలయ్య పువ్వులు పెడదామని చూస్తున్నారు. శేఖర్ నిర్వాకాలపై మొత్తం నియోజకవర్గంలోని నేతలందరూ వ్యతిరేకమయ్యారు. పిఏ ధాటికి తట్టుకోలేక చాలామంది పార్టీకి దూరమయ్యారు. గిట్టని వాళ్లపై ఎన్నో కేసులు పెట్టించారు. ప్రతీ పనికీ ఓ రేటు కట్టి వసూళ్ళు చేసారు. జరుగుతున్న వ్యవహారాలన్నీ మీడియాలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయినా బాలయ్యకివేమీ తెలీదంటే అందరూ నమ్మాల్సిందే.
శేఖర్ వ్యవహారాన్ని నేతలు చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినా ఉపయోగం కనబడలేదు. ఇటు బాలకృష్ణ, అటు శేఖర్ వైఖరితో విసిగిపోయిన నేతలందరూ మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. దాంతో పుట్టి ముణుగుతుంవదని గ్రహించిన చంద్రబాబు, లోకేష్ లు బాలయ్యతో మాట్లాడారు. అప్పుడు బాలకృష్ణ కల్పించుకుని పిఏను దూరంగా పెట్టమని చెప్పారు.
ఆ విషయంగురిచే మాట్లాడుకునేందుకు బాలకృష్ణ హిందుపురం నియోజకవర్గం నేతలను హైదరాబాద్ కు మంగళవారం పిలిపించుకున్నారు. సుమారు 4 గంటలపాటు సమావేశం జరిగింది. పిఏతో తాము పడిన బాధలను ఒక్కొక్కళ్ళుగా బాలకృష్ణకు వివరించారు. దాంతో పాటు బాలయ్య వైఖరిపైన కూడా కాస్త ఘుటుగానే మాట్లాడారు. అదరి బాధలూ విన్న బాలకృష్ణ మాట్లాడుతూ, తన పిఏ నిర్వాకాల గురించి తనకు అసలు తెలీనే తెలీదని అమాయకంగా చెప్పారు. తెలిస్తే వ్యవహారం ఇంతవరకూ రానిచ్చే వాడినే కాదన్నారు. బాలకృష్ణ మాటలువిన్న నేతలు విస్తుపోయారు. ఇకముందు పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు ఓ కమిటి వేద్దామన్నారట. ఎంతైనా నటుడు కదా సమావేశాన్ని బాగనే రక్తి కట్టించాడు. ఎంతైనా అన్నగారి కుమారుడు, హిందుపురం ఎంఎల్ఏ కాబట్టి నేతలు కూడా ఏమనలేక మౌనంగా సమావేశం ముగించుకుని హిందుపురం వెళ్లిపోయారు.