
రోడ్డు ప్రమాదాలకు అంతం లేదా? ప్రభుత్వాల వద్ద విస్తృతమైన యంత్రాంగం ఉండికూడా తరచూ రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయంటే ఏమిటర్ధం? ప్రమాదాలు జరగటం, పదుల సంఖ్యలో ప్రాణాలు హరీ మనటం మామూలైపోయింది. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే యంత్రాంగం ప్రభుత్వం వద్ద లేదా అన్న జనాల ప్రశ్నకు ప్రభుత్వ ఏమని సమాధానం చెబుతుంది? రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోందంటేనే ప్రభుత్వం అచేతనమైపోయిందని తెలుస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద తెల్లవారిజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పదకొండుమంది చనిపోవటం నిజంగా దురదృష్టమే. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
ఒకపుడు వ్యాపారస్తులు వేరు రాజకీయాలు వేరుగా ఉండేవి. ఏదో అవసరం వచ్చినపుడు నాయకులకు వ్యాపారులు తెరవెనుకనుండే సాయం చేసేవారు. అయితే, మారిన కాలంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలే నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించి నేతల అవతారం ఎత్తారు. దాంతో రాజకీయాలు, వ్యాపారాలు ఒక్కటైపోయాయి. దాని ఫలితమే రాజకీయాల్లోకి పలు మాఫియాలు ప్రవేశం. అటువంటి మాఫియాల్లో ట్రావెల్స్ మాఫియా కూడా ఒకటి. దివాకర్ ట్రావెల్స్, కేశినేని ట్రావెల్స్ యాజమాన్యాలు ఇపుడు టిడిపిలోనే ఉన్నాయి. దివాకర్ ట్రావెల్స్ యాజమానులు జెసి బ్రదర్స్. ఇక కేశినేని ట్రావెల్స్ ఓనర్ కేశినేని నాని..విజయవాడ ఎంపి.
వీరిద్దరూ అధికారపార్టీలో కీలక వ్యక్తులు. వీరిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోగలుగుతుంది. అధికారపార్టీ నేతలే కాబట్టి అధికారులకు మొహమాటాలు. ఎవరైనా అధికారులు గట్టిగా చర్యలు తీసుకోవాలన్నా అధికార పార్టీ అడ్డుకుంటుంది. దాంతో ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నామనిపిస్తారు. దాంతో ‘కథ కంచికి మనం ఇంటికి’. దివాకర్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరగటం ఇదే కొత్త కాదు. గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. అయినా యాజమాన్యాలపై ఏం చర్యలూ లేవు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించటంతో వ్యవహారం ముగిసిపోతుంది. మళ్ళీ ప్రమాదం జరిగినపుడు మళ్ళీ ఇదే హడావుడి.