మహాకూటమికి జగన్ ప్రయత్నిస్తారా?

First Published Jun 7, 2017, 9:27 AM IST
Highlights

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మళ్ళీ చంద్రబాబుకే అడ్వాంటేజ్. సో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలకరాకుండా జగన్ చొరవ తీసుకోవాలన్నది ప్రశాంత్ కిషోర్ సలహాగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో జరుగనున్న ప్లీనరీ తర్వాత జగన్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయట.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయోగాన్నే వచ్చే ఎన్నికల్లో జగన్ అమలు చేస్తారా? టిడిపి-భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు దిశగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపుకు అవసరమైన సూచనలు, సలహాల కోసం జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు విషయమై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రశాంత్ కిషోర్  సర్వే చేయించారట.

ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందన్న విషయం స్పష్టమైందట. అయితే, ఆ వ్యతిరేకత మొత్తం జగన్ కు అనుకూలంగా ఉంటుందనే విషయంలో స్పష్టత లేదట. వివిధ కారణాల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే మళ్ళీ చంద్రబాబుకే అడ్వాంటేజ్ అన్న విషయం కూడా అర్ధమైందట.

వచ్చే ఎన్నికల్లో భాజపా-టిడిపి కలిసి పోటీ చేసే విషయంలో స్పష్టతలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గతంలోనే ప్రకటించారు. అయితే, జనసేన-టిడిపి ఒకటే అంటూ రాజకీయవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే కదా?

వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇటీవలే గుంటూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ‘హోదా భరోసా సభ’ విజయవంతమైంది. అందులో పలు పార్టీలతో పాటు రాష్ట్రంలోని వామపక్ష నేతలు కూడా పాల్గొన్నారు.

బహుశా వచ్చే ఎన్నికల్లో వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ పార్టీలకు జనసేన తోడవుతుందో లేక వైసీపీ కలుస్తుందో చెప్పలేం. ఎందుకంటే, టిడిపి-భాజపాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి.

ఒకవేళ జగన్ ఒంటరిగా, వామపక్షాలు-కాంగ్రెస్ కలిసి, జనసేన  విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవటం ఖాయం. దాంతో చంద్రబాబే మళ్ళీ లబ్దిపొందే అవకాశాలున్నాయి. ఒకవేళ భాజపా, టిడిపిలు కలిసే పోటీ చేసినా లేక విడిపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మళ్ళీ చంద్రబాబుకే అడ్వాంటేజ్.

సో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలకరాకుండా జగన్ చొరవ తీసుకోవాలన్నది ప్రశాంత్ కిషోర్ సలహాగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో జరుగనున్న ప్లీనరీ తర్వాత జగన్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయట.

click me!