ఆర్కె నగర్: సంచలన నిర్ణయం తీసుకోనున్న ఇసి

First Published Apr 8, 2017, 11:06 AM IST
Highlights

స్వాధీనం చేసుకున్న ఆధారాలతో ఐటి అధికారులు, ఎన్నికల పరిశీలకులు ప్రధాన ఎన్నికల కమీషనర్ కు డబ్బు ప్రవాహం గురించి ఓ నివేదిక పంపినట్లు సమాచారం. మరి ఎన్నికల కమీషన్ ఏం చేస్తుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే.

మనదేశంలో నిబంధనలున్నది ఉల్లంఘించటానికే అన్నట్లుగా వ్యవహరిస్తారు. నిబంధనలను ఉల్లంఘించటమంటే మన నేతాశ్రీల్లో చాలామంది ఉత్సాహం చూపుతుంటారు. ఇదంతా ఎందుకంటే, తమిళనాడులోని ఆర్కె నగర్ ఉప ఎన్నిక జరుగుతున్న వైనం గురించే. ఉప ఎన్నికలో డబ్బు ప్రవాహంపై ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఉప ఎన్నికలో గరిష్టంగా ఓ అభ్యర్ధి చేయాల్సిన ఖర్చు రూ. 28 లక్షలు మాత్రమే. కానీ ఏ నియోజకవర్గంలో కూడా అది సాధ్యపడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

ప్రస్తుతం ఆర్కె నగర్లో జరుగుతున్న ఉప ఎన్నికలో అభ్యర్ధులు అన్నీ నిబంధనలనూ ఉల్లఘంచి కొత్త రికార్డు సృష్టించారు. అదేమంటే, ఉప ఎన్నికలో గెలవటానికి దగ్గర దగ్గర ఓ అభ్యర్ధి వంద కోట్ల రూపాయల వరకూ వ్యయం చేస్తున్నారట. ఉప ఎన్నికలో గెలవటమం ప్రస్తుతం అధికారంలో ఉన్న చిన్నమ్మ శశికళ వర్గానికి చాలా అవసరం. కాబట్టే శశికళ వర్గం తరపున పోటీ చేస్తున్న టిటివి దినకరన్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారట. మరి, పన్నీర్ సెల్వం వర్గం తరపున పోటీ చేస్తున్న మైత్రేయన్, భాజపా అభ్యర్ధి, దీపా జయకుమార్ వీళ్లంతా ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే, నోళ్ళప్పగించి చూస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అంతకుమించి ఏం చేయగలరు?

అభ్యర్ధి, అభ్యర్ధి తరపున చేస్తున్న ఖర్చుపై హటాత్తుగా ఐటి అధికారులు మంత్రితో పాటు పలువురు నేతల ఇళ్ళపై దాడులు చేసారు. చేసిన ఖర్చులకు సంబంధించి పెద్ద మొత్తంలో ఆధారాలను, బ్యాంకు ఖాతాలను, ఓటర్ జాబితాను స్వధీనం చేసుకున్నారు. దినకరన్ ఇప్పటికే సుమారు రూ. 50 కోట్లు వ్యయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకెంత వ్యయం చేస్తారో అంచనాలకు అందటం లేదు. స్వధీనం చేసుకున్న ఆధారాలతో ఐటి అధికారులు, ఎన్నికల పరిశీలకులు ప్రధాన ఎన్నికల కమీషనర్ కు డబ్బు ప్రవాహం గురించి ఓ నివేదిక పంపినట్లు సమాచారం. మరి ఎన్నికల కమీషన్ ఏం చేస్తుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే.

 

click me!