Tirupati: పంటపొలాలను నాశనం చేస్తున్న ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు ప్రయత్నించారు. అయితే, ఎనుగుల మంద రైతులపై దాడికి ప్రయత్నించింది. దీంతో రైతులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పరుగుతు తీశారు.
Elephant Herd Runs Amok in Pakala: తిరుపతిలో ఒక ఎనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పాకాల మండలం వల్లివేడు గ్రామంలో సోమవారం రాత్రి ఏనుగుల గుంపు దాడి చేసి మామిడి తోటలు, ఇతర వ్యవసాయ పొలాలను ధ్వంసం చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సుమారు 10 ఏనుగులు అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామంలోని పంటభూముల్లోకి ప్రవేశించాయి. ఆ ప్రాంతంలోని మామిడి తోటలు, ఇతర వ్యవసాయ పంటలను ధ్వసం చేయడం ప్రారంభించాయి.
విషయం తెలిసిన రైతులు ఎనుగుల గుంపు నుంచి పంటపొలాలను రక్షించుకోవడానికి చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు తమ పొలాల్లోకి వెళ్లారు. అక్కడి నుంచి ఎనుగులను తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఎనుగుల గుంపు రైతులపై తిరగబడింది. దీంతో రైతులు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈ రచ్చ కొనసాగిన కొద్దిసేపటి తర్వాత తిరిగి అడవుల్లోకి ఎనుగుల మంద వెళ్లింది.
ఈ విషయం గురించి అధికారులకు తెలపడంతో.. ఎంత మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని సందర్శించి స్థానిక రైతులతో మాట్లాడారు. వారికి నష్టపరిహారం, ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఏనుగుల దాడులు పునరావృతం కాకుండా అటవీ శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏనుగుల గుంపు కదలికలపై అటవీ అధికారులు నిఘా పెట్టారనీ, మరిన్ని ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, హోసూరు నుంచి 70 ఏనుగుల గుంపు దిశ మార్చుకుని పొరుగున ఉన్న కర్ణాటకలోని బన్నేరుఘట్ట అడవుల్లోకి ప్రవేశించడంతో చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు ప్రాంతాల్లోని అటవీ గ్రామాలు ఊపిరిపీల్చుకున్నాయి.