హోంమంత్రి దగ్గర టిడిపి ఎంపిల చిట్టా? ఏముంది అందులో ?

First Published Feb 11, 2018, 8:22 AM IST
Highlights
  • పార్లమెంటు బడ్జెట్ మొదటి సెషన్ ముగిసే సమయానికి ఓ సంచలన విషయం వెలుగుచూసింది.

పార్లమెంటు బడ్జెట్ మొదటి సెషన్ ముగిసే సమయానికి ఓ సంచలన విషయం వెలుగుచూసింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నుండి మొదటి నాలుగు రోజులు టిడిపి ఎంపిలు ఇటు రాజ్యసభ అటు లోక్ సభలో నిరసనలు, ఆందోళనల్లో గట్టిగా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే చివరి రెండు రోజులు మాత్రం చప్పబడిపోయారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో. ఎందుకన్నదే చాలామందికి అర్ధం కావటం లేదు. అయితే, అసలు మతలబంతా అక్కడే ఉందట.

టిడిపిలో అంతర్గతంగా ఓ విషయం చక్కర్లు కొడుతోంది. నాలుగు రోజుల పాటు ఆందోళనల్లో పాల్గొన్న టిడిపి ఎంపిలు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో భేటీ అయ్యారట. భేటీ తర్వాతే ఎంపిల్లో జోరు తగ్గిపోయిందట. ఇంతకీ విషయం ఏమిటి? అంటే, ఎంపిల్లో పలువురిపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్టులను హోంశాఖమంత్రి తనను కలసిన ఎంపిల ముందు ఉంచారట. ఎంపిలతో పాటు ప్రభుత్వంలో జరిగిన అవినీతి తాలూకు వివరాలు కూడా అందులో ఉన్నాయట.

రాష్ట్రంలోని వివిధ పథకాలకు కేంద్రం నిధులు ఇచ్చింది. అందులో పోలవరం, రాజధాని నిర్మాణం లాంటి భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే, కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రప్రభుత్వం మాత్రం లెక్కలు చెప్పటం లేదు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఎక్కువ భాగం పక్కదారి పట్టటమో లేక దుర్వినియోగం అయినట్లు వైసిపి నేతలతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

వారి ఆరోపణలకు మద్దతుగా అన్నట్లు హోంశాఖ మంత్రి పలు ఫైళ్ళను ఎంపిల ముందుంచినట్లు సమాచారం. అందులో కేంద్రం నిధులు ఎక్కడెక్కడ పక్కదారి పట్టాయి, జరిగిన అవినీతి ఎంత? ఎవరి జేబులోకి ఎంతెంత వెళ్ళింది? అనే వివరాలున్నాయట. సదరు ఫైళ్ళను చూసిన తర్వాత ఎంపిల నోళ్ళు మళ్ళీ లేవలేదట. అప్పటి నుండే ఎంపిల జోరు తగ్గిపోయిందని పార్టీలోనే అంతర్గతంగా ప్రచారమవుతోంది.

click me!