
చూడబోతే చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం పెద్దగా విజయవంతం అయినట్లు లేదు. ఎందుకంటే, కార్యక్రమం మొదలైనప్పటి నుండి బుధవారం వరకూ ప్రతీ రోజు వివిధ జిల్లాల నేతలకు చంద్రబాబు క్లాసులు పీకుతూనే ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొనని వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా అదే పని చేసారు. కార్యక్రమం జరిగిన తీరు ఆధారంగా నియోజకవర్గాలకు చంద్రబాబు బుధవారం గ్రేడ్లు ప్రకటించారు.
సిఎం లెక్క ప్రకారమే చాలా నియోజకవర్గాలకు సి, డి గ్రేడ్లు వచ్చాయి. దాంతో పలువురు నేతలపై వీడియో కాన్ఫరెన్సులో మండిపడ్డారు. ప్రధానంగా పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు, విజయనగరం చివరకు సొంత జిల్లా చిత్తూరులో కూడా కార్యక్రమం అంతంత మాత్రంగానే జరుగుతోందట. అధికారంలో ఉన్న పార్టీ ఏదన్నా కార్యక్రమం నిర్వహిస్తే అది సక్రమంగా జరగటం లేదంటే ఆశ్చర్యంగానే ఉంది.
పోయిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులుగా ఎన్నో హామీలిచ్చారు. అయితే, గెలిచిన తర్వాత ఏవీ అమలు కాలేదు. దాంతో జనాల్లో అసంతృప్తి, ఆగ్రహం. అది గ్రహించే ఎంఎల్ఏలు కూడా జనాల్లోకి వెళ్ళటం లేదు. అయితే, ఇపుడు తప్పటం లేదు కాబట్టే జనాల్లోకి వెళుతున్నారు. ఎటూ తమ వద్దకే ఎంఎల్ఏలు, నేతలు వస్తున్నారు కాబట్టి జనాలు కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సరే, ఫిరాయింపు ఎంఎల్ఏలది ఇంకో బాధ.
అందుకే సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనితీరు బాగా లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారు. సి, డి గ్రేడింగ్‌లలో ఉన్న నియోజకవర్గాల్లోని నేతల పనితీరు మెరుగుపడకపోతే కొత్త నాయకత్వం వస్తుందంటూ హెచ్చరంచారు. ఇళ్ల నిర్మాణం, పింఛన్లు వంటి ఫిర్యాదులపై చర్చించారు. రేషన్ దుకాణాల్లో చక్కెర, కిరోసిన్ అందటం లేదన్న ఫిర్యాదులపై సిఎం మండిపడ్డారు. నేతల మధ్య సమన్వయం లేకపోవటం, మత్రులు, ఎంఎల్ఏల మధ్య సఖ్యత లేకపోవటం తదితర కారణాల వల్ల కార్యక్రమం అనుకున్నంత విజయవంతం కాలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.