మూడు రాజధానులతో నష్టమేంటీ?: అమరావతి రైతులను ప్రశ్నించిన మంత్రి బొత్స

By narsimha lodeFirst Published Sep 25, 2022, 2:19 PM IST
Highlights

అభివృద్ది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకు వచ్చిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇవాళ విశాఖపట్టనంలో నిర్వమించిన మూడు రాజధానులపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 

విశాఖపట్టణం: మూడు రాజధానులతో వచ్చిన నష్టం ఏమిటనే విషయమై రాజధాని రైతులు  స్పష్టత ఇవ్వాలని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో అమరావతిలోనే రాజధాని నిర్మిస్తున్నట్టుగా రైతులు చెప్పగలరా అని మంత్రి అడిగారు. ఆదివారం నాడు వైసీపీ ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో నిర్వహించిన పాలనా వికేంద్రీకరణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఏ మంత్రి  స్పష్టం చేశారు. 

అమరావతికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం  రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని మరో ఐదేళ్లు తమ ప్రభుత్వం పొడిగించిందని మంత్రి తెలిపారు.అమరావతి పేరుతో చంద్రబాబు సర్కార్ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు.  

 వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ది జరుగుతుందని  ఆయన చెప్పారు.  మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. అందరి అభిప్రాయాలు తెలుసుకొనే మూడు రాజధానులనే నిర్ణయం చెప్పామన్నారు. ఎవరినీ కించపర్చాలనే ఉద్దేశ్యంతో తాము ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. అమరావతిలోని 29 గ్రామాల సమస్యను రాష్ట్రం మొత్తం రుద్దడం దుర్మార్గమన్నారు. మంత్రిగా తనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు  సమానమేనన్నారు. కానీ పుట్టిన ప్రాంతమంటే మమకారం ఎక్కువ అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కానీ రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ది చెందాలని కోరుకోవడం ధర్మంగా ఆయన పేర్కొన్నారు. అలా చేయనిపక్షంలో మంత్రి పదవికి తాను అర్హుడిని కానన్నారు. అలాంటి సమయంలో మంత్రి పదవిని త్యాగం చేయాల్సి న అవసరం ఉందని బొత్స సత్యనారాయణ  చెప్పారు. 

రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు కొందరు వ్యక్తుల కోసం  రాష్ట్ర సంపదను దోచిపెడతామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.  రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యం మనకు తెలుసునని చెప్పారు. తెలంగాణ వాసులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం సాగించిన సమయంలో సమైక్య రాష్ట్రం కోసం ఈ ప్రాంతవాసులు పోరాటంలో పాల్గొనలేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఏపీ వాసులు సౌమ్యులన్నారు. చట్ట ప్రకారంగా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని భావించారన్నారు.  రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు మేల్కొన్నారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. 

అభివృద్ది అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదనే ఉద్దేశ్యంతోనే మూడు రాజధానులను ముందుకు తెచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అభివృద్ది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే ఉద్యమాలు వస్తాయన్నారు. గతంలో ఈ రకమైన ఉద్యమాలు వచ్చాయన్నారు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నామన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా మాట్లాడకపోతే నష్టం జరుగుతుందనే భావనతోనే తామున్నామన్నారు.

also read:విశాఖలో రౌండ్ టేబుల్ మీటింగ్:మూడు రాజధానులపై వైసీపీ కౌంటర్ ప్లాన్

దేశంలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న జిల్లాల్లో  విశాఖపట్టణం ఒకటన్నారు. అందుకే తమ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణాన్ని ఎంచుకుందన్నారు. దీని ద్వారా విశాఖ కేంద్రంగా రాజధాని మరింత వేగంగా అభివృద్ది వైపునకు దూసుకెళ్లనుందని ఆయన చెప్పారు. విశాఖపట్టణంలో ల్యాండ్ పూలింగ్ లో రైతుల నుండి  ఆరు వేల ఎకరాలను తీసుకున్నామన్నారు మంత్రి.
 

click me!