అందుకే మహనాడును విశాఖలో జరుపుతున్నారు

First Published May 28, 2017, 3:20 PM IST
Highlights

చంద్రబాబు కూడా మాటల మధ్యలో ‘తమ్ముళ్ళూ ఉదయం మహానాడుకు రండి సాయంత్రాలు బీచ్ చూడండి’ అన్నారు. అలాగే, ‘కొద్ది దూరంలోనే అరకలోయలున్నాయి, పక్కనే బుర్రాగుహలు ఉన్నాయి. అవసరమైతే రెండు రోజులుండి అన్నీ చూడండి’ అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడు నిర్వహణకు విశాఖపట్నం నగరాన్ని వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లున్నారు. అసలే ఎండాకాలం. ఒళ్లు మంటలెక్కిపోతోంది. ఈ వేసవిలో ఈ ఊరు ఆ ఊరు అని లేదు. ఏ ఊర్లో చూసినా ఎండలు మండిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీలను కూడా తాకినట్లుంది. అటువంటి సమయంలో మూడురోజుల పాటు మహానాడు నిర్వహిస్తే ఎవరైనా వస్తారా? అని చంద్రబాబు ఆలోచించినట్లే ఉంది. కార్యకర్తలు లేకపోతే ఇంక మహానాడుకు షోకేముంది?

ఏ ప్రాంతంలో నిర్వహించాలన్న సమస్య తలెత్తింది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు బాగా ఉంటోంది. అందుకనే వ్యూహాత్మకంగా విశాఖ అయితే బాగుంటుందని అనుకున్నారు. ఎందుకంటే, విశాఖలో బీచ్ ఉంది. మహానాడు కోసం కాకపోయినా కనీసం బీచ్ చూసేందుకైనా వస్తారు కదా? వెంటనే మహానాడుకు విశాఖపట్నాన్ని వేదికగా ప్రకటించారు.

చంద్రబాబు ఊహించనట్లుగానే ఈసారి మహానాడు విశాఖపట్నంలో అనగానే ఆడ, మగ, చిన్నా, పెద్దా అన్న తేడాలేకుండా పోలోమంటూ విశాఖపట్నంలో వాలిపోయారు. ఎందుకంటే, బీచ్ ఉంది. కొద్ది దూరంలోనే అరకలోయలున్నాయి. పక్కనే బుర్రాగుహలున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండి ప్రత్యేకంగా విశాఖపట్నం రావాలంటే కష్టమే. ఇప్పుడంటే మహానాడు సాకు దొరికింది కాబట్టి వచ్చేయోచ్చు అని అనుకున్నారు. వెంటనే వచ్చేసారు.

అందుకే చంద్రబాబు కూడా మాటల మధ్యలో ‘తమ్ముళ్ళూ ఉదయం మహానాడుకు రండి సాయంత్రాలు బీచ్ చూడండి’ అన్నారు. అలాగే, ‘కొద్ది దూరంలోనే అరకలోయలున్నాయి, పక్కనే బుర్రాగుహలు ఉన్నాయి. అవసరమైతే రెండు రోజులుండి అన్నీ చూడండి’ అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇంకేముంది అదినేతే చెప్పిన తర్వాత మహానాడును కూడా పక్కనబెట్టేసి తమ్ముళ్ళంతా  ముందు బీచ్ లో వాలిపోయారు.

click me!