
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబునాయడుకు ఎందుకంత కక్ష? రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ చిన్న పరిణామాన్ని వైసీపీకో లేక నేరుగా జగన్ కే ముడివేసి మరీ తూర్పారపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ కు ఇవ్వాల్సిన కనీస గౌరవం, మర్యాద కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వటం లేదు. ఇపుడు ఇదే విషయంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
గడచిన రుండున్నరేళ్ళుగా రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాలు చంద్రబాబు వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఆగర్భశతృవును చూస్తే ఫ్యాక్షనిస్టులు ఏ విధంగా స్పందిస్తారో అదే విధంగా చంద్రబాబు జగన్ పై విరుచుకుపడుతున్నారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్నట్లు మంత్రులు, పలువురు నేతలు కూడా జగన్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
తాజా విషయాన్నే తీసుకుంటే, తిరుపతిలో చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీకి ఒక్క ఎంఎల్ఏ కూడా లేకుండా ఉంటే బాగుండేదన్నారు. అస్సలు ప్రతిపక్షం తరపున శాసనసభ్యులే లేకుంటే రాష్ట్రం అభివృద్ధి జరిగేదనటం విచిత్రం. అంటే చంద్రబాబు ఉద్దేశ్యమేమిటి రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలనే కదా? ఇపుడు చేస్తున్నదదే కదా.
మొన్నటి ఎన్నికల్లో టిడిపి, భాజపాలకు ఓట్లు వేసిన జనాలే వైసీపీకి కూడా వేసారు. అందుకే వైసీపీకి 67 స్ధానాలు వచ్చాయి. అయితే, ప్రజా తీర్పును చంద్రబాబు అపహాస్యం చేయబట్టే ఫిరాయింపుల ద్వారా 22 మంది వైసీపీ ఎంఎల్ఏలను టిడిపిలోకి చేర్చుకున్నారు.
ఇక్కడ చంద్రబాబు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ బయటకు వచ్చేసి వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు అనేకమంది టిడిపి ఎంఎల్ఏలు వైసీపీలో చేరారు. అయితే, వారందరి చేత జగన్ ముందు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయించి గానీ పార్టీలోకి చేర్చుకోలేదు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రైన దగ్గర నుండీ అమరావతి శంకుస్ధాపన కార్యక్రమానికి ఆహ్వానం పంపటం మొదలు శాసనసభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం వరకూ ప్రతి చోటా కించపరుస్తూనే ఉన్నారు. అమరావతి ప్రాంతంలొ రైతుల పొలాలు తగలబడితే జగనే చేయించాడన్నారు.
తునిలో రైలు దహనం కేసులో కూడా జగనే చేయించాడని చంద్రబాబే ఆరోపించారు. అంటే ఎక్కడబడితే అక్కడ గుడ్డ కాల్చి జగన్ మొహాన పడేస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న కక్షను చంద్రబాబు ఇపుడు జగన్ పై చూపుతున్నారా అన్న అనుమానం వస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై వైఎస్సే పూర్తి ఆధిపత్యం సాధిచారు. వైఎస్ ను చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు.
అయితే, రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలానికే వైఎస్ మరణించారు. వైఎస్ వెళ్ళిపోయినా వైఎస్ పై చంద్రబాబు కక్ష అలానే మిగిలిపోయిందేమో అనిపిస్తోంది. దానికి తోడు మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దుతుగా మోడి, పవన్, కాపులు, బిసిలు, ఉచిత హామీలు నిలబడినా వైసీపీకి 67 సీట్లు రావటాన్ని చంద్రబాబు తట్టుకోలేకున్నట్లున్నారు.
దానికితోడు ఎన్డిఏ అధికారంలోకి రాగానే జగన్ మళ్ళీ జైలుకు వెళ్లటం ఖాయమని అనుకుంటే ఆయనపై ఉన్న కేసుల్లో ఒక్కోటీ వీగిపోతున్నాయి. 22 మంది ఎంఎల్ఏలను లాక్కున్నా నిబ్బరంగా రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు జగన్ పై వ్యక్తిగతంగా కక్ష పెరిగిపోతోందని అనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి శాస్వతం కాదని, ఎల్లకాలం ప్రతిపక్షంలోనే ఉండిపోరని 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు తెలీనిది కాదు కదా. మరి ఎందుకని అంతలా రెచ్చిపోతున్నారో....