
ప్రజాగ్రహానికి ఎట్టకేలకు చంద్రబాబునాయడు ప్రభుత్వం దిగొచ్చింది. అట్టహాసంగా నిర్వహించాలనుకున్న బీచ్ లవ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 12-14 తేదీల మధ్య వ్యాలంటైన్స్ డే సందర్భంగా లవ్ బీచ్ ఫెస్టివల్ ను అదిరిపోయేట్లు చేయాలని ప్రభుత్వం అనుకున్నది.
అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ముంబాయిలోని పాజిటివ్ గ్లోబల్ కన్సెల్టెన్సీ అనే సంస్ధ ముందుకు వచ్చింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా పై తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 వేల జంటలను విశాఖకు రప్పించేందుకు ప్లాన్ కూడా సిద్ధమైంది.
ఆ దశలో ప్రభుత్వ ఆలోచన బయటకు పొక్కటంతో మొత్తం అల్లరైంది. ప్రభుత్వంపై స్ధానికులు మండిపడ్డారు. కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్ధి సంఘాలు ఇలా ప్రతీ ఒక్కరూ రోడ్డెక్కారు.
విచిత్రమేమిటంటే కార్యక్రమానికి వ్యతిరేకంగా మిగిలిన పక్షాలతో పాటు ఆరెస్సెస్, ఏబివిపి వంటి భాజపా అనుబంధ సంస్ధలు కూడా రోడ్డెక్కటం. దాంతో ప్రభుత్వంలో పునరాలోన మొదలైంది. అనేక తర్జన భర్జనల అనంతరం బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించకూడదని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది.