
‘ఇంకా కొన్ని కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది, అవెప్పుడు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం’.. ఇవి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు. శుక్రవారం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు లేండి. ఈ సందర్భంగా మాట్లడుతూ పై వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా ఎక్కడ ఎన్నికలు జరిగినా అవే ఫలితాలు పునరావృతమవుతాయట. ఎన్నికలన్నీ ఒకేసారి పూర్తయితే పాలనపై దృష్టి పెట్టటానికి వీలవుతుందట. భారతీయ జనతా పార్టీకి కేటాయించిన సీట్లలో సరైన ఫలితాలు రాకపోవటంపై సమీక్ష జరుపుతారట. నిజంగా ఎంత పెద్ద జోకు పేల్చారో.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పై మాటలు విన్నవారికి చంద్రబాబు చెప్పిందంతా నిజమేకదా? అనిపించకమానదు. కానీ ఇక్కడే విషయమంతా ఉంది. అదేంటంటే, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు పెట్టాల్సింది రాష్ట్రప్రభుత్వమే. అంటే చంద్రబాబునాయుడే. మరి ఇంతకాలం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. మున్సిపల్ ఎన్నికలు పెట్టవద్దని ఎవరన్నా చంద్రబాబుకు అడ్డుపడుతున్నారా? ఎన్నికలు జరిపితే జనాలు టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రూపంలో కాపుల ఓట్లకు గండిపడుతుందన్న భయంతో చంద్రబాబే ఇంతకాలం ఎన్నికలు జరపలేదన్నది వాస్తవం.
ఇపుడు జరిగిన నంద్యాలైనా, కాకినాడ ఎన్నికైనా చంద్రబాబు ప్రమేయం లేకుండా జరిగినవే. నిజంగానే మున్సిపాలిటీలకన్నింటికీ ఎన్నికలు జరగాలని చంద్రబాబుకుంటే మరి ఇంత కాలం ఎందుకు ఆగినట్లు? గెలుపుపై నమ్మకం లేకే ఆగిపోయారన్నది నిజం. కాకపోతే రెండు ఎన్నికల్లోనూ టిడిపికి అనుకూలంగా ఊహించని రీతిలో ఫలితాలొచ్చేసరికి ఇపుడు రెచ్చిపోతున్నారు.
ఇక, భాజపాకు కేటాయించిన సీట్లలో సరైన ఫలితాలు రాని విషయాన్ని సమీక్ష జరుపుతారట. నిజానికి సమీక్షంటూ కొత్తగా ఏమీ అవసరం లేదు. ఎందుకంటే, భాజపాకు కేటాయించిన 9 డివిజన్లలో 6 చోట్ల టిడిపి అభ్యర్ధులే పోటీ చేసింది వాస్తవం కాదా? అందులో మూడు చోట్ల టిడిపినే గిలిచింది. ఎలాగంటే, అక్కడ టిడిపి నేతలు భాజపా అభ్యర్ధులకు కాకుండా టిడిపి తిరుగుబాటు అభ్యర్ధులకే పనిచేసారన్నది వాస్తవం. మరి, ఆ ముగ్గురు తిరుగుబాటు అభ్యర్ధులను టిడిపి నుండి సస్పెండ్ చేస్తారా? నిజాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే మళ్ళీ సమీక్షలెందుకు? అంటే దీని వెనుక చంద్రబాబు ఏదో వ్యూహం ఆలోచించే పెట్టుకుని ఉంటారు. అందుకే సమీక్షలంటూ కొత్త నాటకానికి తెరలేపుతున్నారు.