పాదయాత్ర విషయంలో ఏం చేస్తారు?

First Published Sep 2, 2017, 7:37 AM IST
Highlights
  • అక్టోబర్లో మొదలుపెట్టనున్న పాదయాత్రకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి ఏర్పాట్లు చేసుకుంటారన్న విషయమై చర్చ మొదలైంది.
  • వ్యక్తిగత మినహాయింపును కోరుతూ జగన్ వేసిన పిటీషన్ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే కదా?
  • ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్ళి హాజరువేసుకు రావటాన్ని ఇప్పటికీ మంత్రులు, టిడిపి నేతలు ఎక్కడ అవకాశం దొరికినా ఎద్దేవా చేస్తున్న విషయం చూస్తున్నదే.
  • న్యాయస్ధానం రూపంలో సాంకేతికపరమైన అడ్డంకులున్నాయి. కాబట్టి ముందు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.

అక్టోబర్లో మొదలుపెట్టనున్న పాదయాత్రకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి ఏర్పాట్లు చేసుకుంటారన్న విషయమై చర్చ మొదలైంది. పాదయాత్ర చేయటానికి వీలుగా వ్యక్తిగత మినహాయింపును కోరుతూ జగన్ వేసిన పిటీషన్ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే కదా? మరిప్పుడు కింకర్తవ్యం ఏంటి? అన్నదే పెద్ద ప్రశ్న. ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్ళి హాజరువేసుకు రావటాన్ని ఇప్పటికీ మంత్రులు, టిడిపి నేతలు ఎక్కడ అవకాశం దొరికినా ఎద్దేవా చేస్తున్న విషయం చూస్తున్నదే.

ఇటువంటి నేపధ్యంలోనే అక్టోబర్ నుండి జగన్ పాదయాత్ర మొదలుపెడుతున్నట్లు ప్రకటించటం ఒకరకంగా సాహసమే. ఎందుకంటే, సుదీర్ఘ కాలం పాదయాత్ర చేయాలనుకున్న వ్యక్తి ముందు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. వైఎస్ అయినా చంద్రబాబైనా చివరకు షర్మిలైనా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకున్నాకే పాదయాత్ర మొదలుపెట్టారు. కానీ ఇక్కడ జగన్ ది ఆరోగ్యపరమైన విషయం కాదు.

న్యాయస్ధానం రూపంలో సాంకేతికపరమైన అడ్డంకులున్నాయి. కాబట్టి ముందు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. అక్రమాస్తుల కేసుల విచారణలో బెయిలు మీద జగన్ బయట తిరుగుతున్నా ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్ళి సంతకాలు చేయాల్సి రావటం జగన్ కు పెద్ద ఇబ్బందే.

సరే, ఇపుడంటే ప్రతీ రోజు జగన్ ఏమి చేస్తున్నారని చూసే జనాలుండరు కాబట్టి చెల్లుతోంది. కానీ ఒకసారి పాదయాత్రంటూ మొదలుపెట్టిన తర్వాత కుడా ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్ళటమంటే ఇబ్బందే. పాదయాత్ర మొదలైన తర్వాత టిడిపి ఈ విషయంలో జగన్ పై మరింత రెచ్చిపోతుందనటంలో సందేహం లేదు.

జగన్ పరిస్ధితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’లాగ తయారైంది. ఎలాగంటే, పాదయాత్ర చేస్తూ మధ్యలో కోర్టుకు వెళ్ళటం బాగోదు. అలాగని కోర్టుకు గైర్హాజరూ కాలేరు, పోనీ పాదయాత్రను వాయిదా వేద్దామా అంటే అదీ సాధ్యం కాదు. ఎందుకంటే, మడమతిప్పని వంశం కదా? సమస్య నుండి ఎలా బయటపడాలన్న విషయమే  జగన్ను వేధిస్తోందిపుడు. 

click me!