
మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలి ఎవరికీ అర్ధం కావటం లేదు. జిల్లాలోని నేతలెవరితోనూ మంత్రి కలవటం లేదు. దాంతో అందరూ మంత్రికి దూరమవుతున్నారు. ఉపఎన్నికలో పార్టీ పరిస్ధితి అసలే అంతంతమాత్రంగా ఉంది. దానికితోడు అఖిల వ్యవహారశైలిపై నేతలందరూ మండిపడుతున్నారు. మంగళవారం జరిగిన రెండు సంఘటనలపై పార్టీలో చర్చ జరుగుతోంది. నంద్యాల ఉపఎన్నికల్లో అఖిల దాదాపు ఒంటరైపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మంత్రులెవరూ అఖిలను పెద్దగా కలవటం లేదు. పైగా ప్రచారానికి వచ్చిన మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు నేతలందరూ అఖిలకు వ్యతిరేకమైన ఏవి సుబ్బారెడ్డినే కలుస్తున్నారు. అందుకు తగ్గట్లే చంద్రబాబునాయుడు కూడా అఖిలను కేవలం ప్రచారానికే పరిమితం చేసేసారు.
దానికితోడు అఖిల కూడా మొదటినుండి ఒంటెత్తుపోకడనే కొనసాగిస్తున్నారు. సరే, ప్రస్తుత విషయానికి వస్తే ఎంఎల్సీ అయినందుకు స్ధానిక ముస్లిం నేతలు, పార్టీ నేతలు ఫరూక్ కు మంగళవారం సన్మానం చేసారు. ఫరూక్ సన్మాన కార్యక్రమంలో భాగంగా అఖిల పేరుతో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేసారు. కార్యక్రమానికి అఖిల హాజురుకాలేదు. ఫరూక్ ముస్లి నేతన్న విషయం అందరికీ తెలిసిందే. నియోజకవర్గంలో ముస్లిం జనాభా బాగా ఎక్కువుంది కాబట్టే చంద్రబాబు కూడా ఫరక్ కు ఎంఎల్సీ ఇచ్చారు. అంటే ముస్లిం సామాజికవర్గం ఓట్లు ఎంత కీలకమో అర్ధమైపోతుంది. ఫరూక్ కు సన్మానం, అందులోనూ ఉపఎన్నిక సందర్భంలో జరుగుతుంటే అఖిల గైర్హాజరవ్వటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.
అదే విధంగా పార్టీ కార్యాలయంలో కెఇ, సోమిరెడ్డి మీడియా సమావేశంలో అఖిల పాల్గొనాల్సుంది. అయితే, మీడియా సమావేశానికి తాను హాజరవ్వటం లేదని కబురు పంపటంతో మంత్రులు ఆశ్చర్యపోయారు. అటు సన్మాన కార్యక్రమానికీ హాజరుకాక ఇటు మీడియా సమావేశానికీ గైర్హాజరైన అఖిల ఎటు వెళ్లారో ఎవరికీ అర్ధం కాలేదు. భూమా నాగిరెడ్డికి జిల్లాలోని చాలా మందితో పడదు. సరే, ఇపుడాయన ఎటూలేరు. ఆయన కూతురు, మంత్రైన అఖిలన్నా ప్రస్తుత పరిస్ధితిల్లో అందరి సహకారం తీసుకుంటుందనుకుంటే తండ్రి ఒరవడినే కొనసాగిస్తోంది. మరి, ఎవరితోనూ సఖ్యతగా ఉండకుండా ఉపఎన్నికలో ఎలా గెలుద్దామనుకుంటోందో?