
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలో ప్రజాపోరాట యాత్ర సందర్భంగా అధికార పార్టీ నేతలపై బహిరంగ సభల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతున్నారు. విశాఖ్క్షలో భూ కబ్జాలపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు నివేదిక సీఎం చంద్రబాబునాయుడు టేబుల్‌పై ఉందన్నారు. ఈ నివేదికపై సీఎం చంద్రబాబునాయుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.ఈ విషయం ఉత్తరాంధ్ర ప్రజలకు, మేథావులకు అర్ధం కావడం లేదన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ నేతల తీరును ఆయన ఎండగట్టారు.
ఉత్తరాంధ్రలో చోటు చేసుకొన్న భూకబ్జాలు, కాలుష్యంపై కూడ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలోని సమస్యలను ఆయన ప్రస్తావించారు.
పెందుర్తి నియోజకవర్గంలోని ముదుపాక గ్రామంలో యాదవులు, దళితులు, వెనుకబడిన కులాలకు చెందిన 1973లో సాగు చేసుకోవడానికి పట్టాలు ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.అప్పట్లో ప్రభుత్వం 953 ఎకరాలను పేదలకు పట్టాలను ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ భూముల్లో రైతులు జీడి తోటలను పెంచుతున్నారన్నారు.
సాగునీటి వసతి లేని కారణంగా కిలోమీటర్ దూరంలో ఊటబావుల నుండి నీటిని తెచ్చుకొని వ్యవసాయం చేస్తున్నట్టు పవన్ తెలిపారు. అయితే ఈ భూములను ఆక్రమించుకొనేందుకుగాను కొందరు ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. రాత్రికి రాత్రే ప్రొక్లెయినర్లను తెచ్చి చెట్లను కూల్చేశారని ఆయన చెప్పారు.
ఈ విషయమై ప్రశ్నించిన రైతులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పంటలను నాశనం చేయడమే కాకుండా రైతులపైనే కేసులు పెడుతూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వపన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
2014లో ఉత్తరాంధ్ర భూములు కబ్జాకు గురికాకుండా చూస్తామని హమీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.స్థానిక టీడీపీ నేతల మద్దతుతో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన గూండాలు ఈ భూములను ఆక్రవించుకొంటున్నారని ఆయన ఆరోపించారు.
ఈ రకమైన పనులు చేసే తెలంగాణ ప్రజలకు కోపం తెప్పించారన్నారు. ఇప్పుడు అదే పనులు చేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు అసంతృప్తికి కారణమౌతున్నారని ఆయన చెప్పారు. వీటి పర్యవసానాలు సమీప భవిష్యత్తులో ఎలా ఉంటాయో టీడీపీ నేతలకు తెలియవా అని ఆయన ప్రశ్నించారు.