
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఎపి ఎక్సైజ్ మంత్రి జవహర్ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ లాంటి నిలకడలేని వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని అన్నారు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చేతకాక కాంగ్రెస్ పార్టీకి హోల్ సేల్ గా అమ్ముకున్నాడని, ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ జనసేనను స్థాపించి రిటైల్ గా అమ్మడానికి సిద్దంగా ఉన్నారని విమర్శించారు. ఇలా విశ్వసనీయత లేకుండా కేవలం అధికారం కోసం తాపత్రయపడేవారు రాజకీయాల్లో పనికిరారని జవహర్ అన్నారు.
కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జవహర్ ప్రతిపక్ష వైఎస్సార్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ని కూడా విమర్శించారు. ఆయనకు అధికార దాహం తప్పా ప్రజలకు ఎలా మంచి చేయాలన్న ఆలోచనే లేదని అన్నారు. సీఎం కుర్చీ కోసమే జగన్ పాదయాత్ర సాగుతోందని, ఈ విషయం రాష్ట్ర ప్రజలు కూడా అర్థమైందని అన్నారు.
ఇక మరో పార్టీ బిజెపి ని ప్రజలు మరిచిపోయారని, కావున మరోసారి ఆంధ్రప్రదేశ్ కు సీఎం చంద్రబాబు నాయుడు గెలవటం ఖాయమని జవహర్ ధీమా వ్యక్తం చేశారు.దళితులకు టిడిపి ప్రభుత్వం లోనే న్యాయం జరిగిందని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి జవహర్ ధీమా వ్యక్తం చేశారు.