
అయ్యన్నపాత్రుడి ఇళ్లు ధ్వంసం చేయడం వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేని సమయంలో నర్సీపట్నంలోని ఆయన ఇంట్లో పోలీసులు అరాచకం సృష్టించడం సిగ్గు చేటని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
వేకువజామున 3 గంటలకు ఇంట్లో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రవర్తించారని ఆరోపించారు. ఆ సమయంలో వెళ్లి ఇళ్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఈ అధికారం ఎవరిచ్చారని అన్నారు. అధికారంలో ఉంటే ఏమి చేసినా చెల్లిపోతుందా అని ప్రశ్నించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులను వైసీపీ గూండాలుగా వాడుకుంటోందని ఆరోపించారు.
న్యాయం చేయాలని వీల్‌చైర్‌లో తాడేపల్లికి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. అడ్డుకున్న పోలీసులు..
నిండు అసెంబ్లీలో సీఎం జగన్ రెడ్డి సమక్షంలోనే సమయంలో ఆ పార్టీ నాయకులు మా గురించి మాట్లాడితే సప్త స్వరాలలా వినిపించాయా అని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు వాడిన భాషలో కేవలం ఒక్క శాతం మాత్రమే అయ్యన్నపాత్రుడు వాడాడని, దానికి ఇళ్లు ధ్వంసానికి పూనుకుంటారా అని ప్రశ్నించారు. మొన్న ఉండవల్లిలో చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడికి వచ్చారని, నిన్న మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంపై పట్టపగలే దాడి చేశారని ఆరోపించారు. నేడు ఏకంగా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇల్లు ధ్వంసం చేశారని అన్నారు.
జనం తరఫున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా..?: అధికారుల తీరుపై అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యుల ఆగ్రహం
గుడివాడకు గోవా కల్చర్ తీసుకొచ్చిన వారిపై, అలాగే టీడీపీ కార్యాలయంపై చేసిన వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. భారతదేశ వ్యాప్తంగా పౌరులకు ఉన్న హక్కులు ఏపీలో తమకు లేవని అన్నారు. తమపై దాడి చేసి తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. కేసులంటే తెలియని తనపైనే ఆరు కేసులు బనాయించారని ఆరోపించారు. ఇన్ని పాపాలు చేస్తున్న వైసీపీ నాయకులను దేవుడు క్షమించడని అవేదన వ్యక్తం చేశారు. సీఎం అయినంత మాత్రాన చట్టాలు చేతుల్లోకి తీసుకోవడం కుదరదని గుర్తుంచుకోవాలని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడం వల్ల తమలో కూడా ఓర్పు నశించిపోతోందని అన్నారు. ఇష్టానుసారం రౌడీల రాజ్యం కొనసాగిస్తామంటే తాము చూస్తూ ఊరుకోబోమని తెలిపారు.
ఆదివారాన్ని జగన్ విధ్వంస దినంగా మార్చారు - అచ్చెన్నాయుడు
ఆదివారాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విధ్వంస దినంగా మార్చారని టీడీనీ నాయకుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడిపై సీఎం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్నారని ఆరోపించారు.
అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతే ఇంటి నిర్మాణం: అయ్యన్న రెండో కొడుకు రాజేష్
ఆంధ్రప్రదేశ్ గూండారాజుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని తీవ్రంగా విమర్శించారు. అధికార వైసీపీకి పోలీసులు మద్దతుగా నిలిస్తే.. తరువాత వచ్చే టీడీపీ ప్రభుత్వంలో వారు వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు. జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలని విమర్శించారు. పోలీసుల అతిప్రవర్తన హద్దు అదుపు లేకుండా పోయిందని అన్నారు. నేరస్థుడు రాజ్యం ఏలితే ఎన్ని అనర్ధాలు చోటు చేసుకొంటాయో, అరాచక శక్తులు ఏ విధంగా చెలరేగిపోతాయో, ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా నాశనమవుతుందో మూడేళ్లలో జగన్ రెడ్డి పాలనలో జరిగిన ఉదంతాలే నిదర్శనమని ఆరోపించారు.