ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన 35 రోజులు పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని, చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అనుభవాన్ని ప్రశ్నిస్తూ, ఆయన విడుదల చేసిన శ్వేతపత్రాలను అసత్యాలతో నిండినవిగా ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన 35 రోజులు పూర్తయిందని, తనంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు ఆయన అనుభవం ఏమైందని మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. నాలుగు అసత్యాలు, పది అబద్ధాలతో చంద్రబాబు శ్వేతపత్రాలు ఉన్నాయని, నెల రోజులుగా కాలక్షేపం చేస్తూ వైఎస్ జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో కూటమి పాలన 35 రోజులు పూర్తయ్యింది. ఈ 35 రోజుల్లో చంద్రబాబు ఏం అడుగులు వేశారో చెప్పాలి. ఈ 35 రోజుల్లో పెన్షన్ డబ్బులు ఇవ్వడం తప్ప మరో పని చేయలేదు. జగన్‌ను దూషించటం తప్ప ఒక్క పని కూడా చేయలేదు. కాలక్షేపం కోసం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేయడం తప్ప ఒక్కటైనా నిరూపించారా..? ఎన్నికల్లో చంద్రబాబు మాటలు కోటలు దాటాయి. ప్రజల కోసం చంద్రబాబు చేసిందేమి లేదు’’ అని విమర్శించారు.
undefined
‘‘పోలవరం ప్రాజెక్టు 70 శాతం మీరే కట్టారని చెబుతున్నారు. మిగతా 30 శాతం ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అమరావతి అంతా తిరిగారు. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పరు. విద్యుత్ శాఖపై కూడా శ్వేతపత్రం ఇచ్చారు. వైయస్ జగన్ మీద అబద్ధాలతో శ్వేత పత్రం విడుదల చేశారు.’’
‘‘విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చెప్పారు. మళ్లీ విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు మాట మర్చేశారు. వైఎస్ జగన్‌పై బాదుడే బాదుడే అంటూ అసత్య ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి 35 రోజులైంది.. చెత్త పన్ను ఆపారా..? వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు చెత్త పన్ను విధిస్తే విమర్శించారు. చెత్త పన్ను కొనసాగిస్తున్న మిమ్మల్ని ఏమనాలి..? మైనింగ్‌పై అబద్ధాలతో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. మైన్స్‌లో మీ కంటే రెండు రెట్లు ఎక్కువ ఆదాయం వైఎస్ జగన్ సమకూర్చారు.’’
‘‘బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఇదేనా మీ అనుభవం.. ఇంతకుమించి అని చేయలేరా? ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు ఖజానా డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. బాబు సీఎం అయ్యే 48 గంటల ముందు కేంద్రం రూ.5,600 కోట్లు ఇచ్చింది’’ అని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.