
ఆ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ చెప్పిందే చట్టం. కాకపోతే ఆయన నేరుగా ఎవరికీ ఏదీ చెప్పరు. ఆయన పిఏ శేఖర్ ద్వారానే అన్నీ చెప్పిస్తారు. అందుకే నియోజకవర్గం మొత్తం మీద పిఏ చెప్పిందే వేదం, శాసనం. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదనుకుంటున్నారా? పార్టీ ఆవిర్భావం నుండి టిడిపికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లాలోని హిందుపురం. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసిన సినీనటుడు కమ్ చంద్రబాబునాయుడు బావమరిది బాలకృష్ణ హిందుపురం నుండి పోటీ చేసి గెలిచారు. స్వయంగా ఎన్టీఆర్ కుమారుడు, చంద్రబాబు బావమరది ఎంఎల్ఏ కాబట్టి తమ నియోజకవవర్గానికి మహర్ధశే అనుకున్నారందరూ.
అయితే, ప్రజలు, నేతల ఆశలు తల్లక్రిందులవ్వటానికి ఎంతో కాలం పట్టలేదు. ఎందుకంటే, నియోజకవర్గానికి ఎంఎల్ఏ బాలకృష్టే గానీ పెత్తనమంతా మొత్తం పిఏదే. బాలకృష్ణ తరపున వ్యవహారాలన్నీ నడిపేది శేఖరే. ఎందుకంటే సినీనటుడైనా బాలకృష్ణకు నియోజకవర్గంలో పనులు చేపట్టేంత తీరిక ఉండదు. తనను ఎవరైనా కలవాలనుకున్నా, ఏదైనా చెప్పాలనుకున్నా సాధ్యంకాదు. కాబట్టి తన పిఏతోనే అన్నీ మాట్లాడుకోమని, చెప్పుకోమని ఎంఎల్ఏ పవర్ ఆఫ్ అటీర్నీ రాసేసాసినట్లున్నారు. దాంతో ఒకవిధంగా శేఖరే నియోజకవర్గంలో ఎంఎల్ఏ గా చెలామణి అవుతున్నారు.
అక్కడి పరిస్ధితి ఏమిటంటే, బాలకృష్ణ(శేఖర్) అనుమతి లేనిదే ఎవరు కూడా నియోజకవర్గంలోకి అడుగుపెట్టకూడదు. అందుకని జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా, ఎంపి ఉన్నా ఎవరూ అటువైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయరు. ఇక, కలెక్టర్, ఎస్పీ అంటారా వారూ అంతే. బాలకృష్ణ స్వయానా సిఎంకు బావమరది అని తెలిసిన తర్వాత ఏ ఉన్నతాధికారి కూడా నియోజకవర్గంలోకి అడుగుపెట్టటమే లేదు. ప్రభుత్వ ఏర్పడి రెండున్నరేళ్ళవుతున్నా ఇప్పటి వరకూ ఏ మంత్రి కూడా హిందుపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేదంటే ఎవరైనా నమ్ముతారా? హిందుపురం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపి నిమ్మల కిష్టప్ప అయితే నియోజకవర్గం కేంద్రం వైపు చూడటానికి కూడా సాహసించటం లేదు.
ఎంఎల్ఏ ఎప్పుడైతే పిఏ కే పెత్తనం కట్టబెట్టారో అప్పటి నుండే నియోజకవర్గంలో ముసలం బయలుదేరింది. నియోజకవర్గం పరిధిలో ఎటువంటి అభివృద్ధిపనులు జరగాలన్నా పిఏకి కప్పం చెల్లించాల్సిందేనంటూ ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. మొత్తం పనులన్నీ పార్టీకి ఏమాత్రం సంబంధంలేని వారికే వెళుతున్నాయట. కప్పం వసూలు చేసుకోవటం, పనులు కట్టబెట్టటమే దినచర్యగా సాగుతోందంటూన్నారు. గిట్టని వారిని ముప్పుతిప్పలు పెట్టటమే పిఏ పనిగా పెట్టుకున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. గిట్టని వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారనే అరోపణలు కూడా ఉన్నాయి.
ఏపి అరాచకాలు మితిమీరిపోవటంతో సహించలేక నియోజకవర్గంలోని చిలమత్తూరు, లేపాక్షి, హిందుపురం రూరల్ మండలాల్లోని నేతలు ఎదురుతిరుగుతున్నారు. హిందుపురం మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ కూడా అదే పరిస్ధితి. పిఏ పరిస్ధితిని వివరిద్దామని అనుకుంటే బాలకృష్ణ అవకాశం ఇవ్వటం లేదు. చంద్రబాబు, లోకేష్ కు చెప్పినా వారూ చేతులెత్తేసారు. దాంతో నియోజకవర్గంలోని నేతల పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలుకలాగ తయారైంది. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్న విషయాన్ని బాలకృష్ణ మచిపోయినట్లున్నారు. నిజ జీవితంలో కూడా సినిమాపాత్రలోనే జీవిద్దామని బాలకృష్ణ అనుకుంటున్నట్లున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.