
ఎవరి లెక్క కరెక్టు ?
పెట్టుబడుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు పరస్పర విరుద్దంగా ఉన్నాయి. దాంతో రెండు ప్రభుత్వాల ప్రకటనల్లో ఏది నిజమనే విషయమై జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. వినేవాళ్లను చంద్రబాబు వెర్రోళ్ళనుకుంటున్నారో ఏమిటో అర్ధం కావటం లేదు. ఇటీవలే విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, దేశ, విదేశాలకు చెందిన పలు సంస్ధలు ప్రభుత్వంతో రూ. 10.54 లక్షల కోట్ల విలువైన 665 ఒప్పందాలు చేసుకున్నట్లు ఘనంగా ప్రకటించారు.
అలాగే, పోయిన ఏడాది కూడా రూ. 4.7 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు జరిగితే రూ. 2.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లుగా చెప్పటంతో పలువురు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా సుమారు 4 లక్షల మందికి ఉపాధి కూడా కల్పించినట్లు చెప్పటంతో విన్నవాళ్లు నోరెళ్లపెట్టారు. ఎందుకంటే, గడచిన ఏడాదిలో దేశం మొత్తం వచ్చిన పెట్టుబడులే రూ. 99 వేల కోట్లుగా డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) ప్రకటించింది. అదేవిధంగా, డిఐపిపి వద్ద రిజిస్టర్ అయిన సంస్ధల మొత్తం పెట్టుబడుల విలువే సుమారు రూ. 35 వేల కోట్లు.
మరి, డిఐపిపి లెక్కలు అలా వుంటే, చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో పోయిన ఏడాది రూ. 2.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు ఎలా చెప్పారో? ఎక్కడ భాగస్వామ్య సదస్సు జరిగినా చేసుకున్న ఒప్పందాల్లో 10శాతం పెట్టుబడులు వస్తే చాలా ఎక్కువ. ఇక్కడే చంద్రబాబు ప్రచార కక్కుర్తి బయటపడుతోంది. డిఐపిపి అనేది కేంద్రప్రభుత్వ సంస్ధ. దానికి కథలు చెప్పాల్సిన అవసరం లేదు. మరి చంద్రబాబుకు మాత్రం ఏం అవసరం వచ్చిందంటే, ఆయనకు మొదటి నుండీ ఉన్న అలవాటే. ఏమీ లేకపోయినా అంతా బ్రహ్మాండమన్న ప్రచారం చేసుకోవటం అందరికీ తెలిసిందే. ఒకరోజు కాకపోయినా ఏదోరోజు అందరికీ వాస్తవాలు తెలుస్తాయన్న విషయం తెలిసినా అలా ప్రచారం చేసుకోవటానికి చంద్రబాబు అలవాటు పడిపోయారు.
నిజానికి ఉన్నతాధికారులు చెప్పే మాటేమిటంటే ఒప్పందాల పేరుతో వచ్చే సంస్ధల్లో అత్యధికం ప్రభుత్వం నుండి భూములు, రాయితీలను కొట్టేసేందుకే వస్తాయని. ఒప్పందాలకు ముందే సదరు సంస్ధల ట్రాక్ రికార్డు చూడకపోవటం వల్లే ప్రభుత్వం నవ్వుల పాలవుతోంది. వాస్తవాలు ఈ విధంగా ఉండగా తాజాగా జరిగిన సదస్సులో రూ. 10.54 లక్షల విలువైన ఒప్పందాలు జరిగినట్లు మళ్ళీ చంద్రబాబు ప్రకటించటం గమనార్హం. నిజంగా చంద్రబాబు గ్రేటే. ఎందుకంటే, ఆయనేమి చెప్పినా అంతా లక్షల కోట్లలోనే ఉంటుంది.