చంద్రబాబుకు ఏమైంది?

First Published Jun 5, 2017, 8:19 AM IST
Highlights

రాష్ట్ర విభజనను చంద్రబాబు హత్యతో పోల్చటం మరీ విచిత్రంగా ఉంది. రాష్ట్ర విభజన నిజంగా హత్యే అయితే, జరిగిన హత్యలో చంద్రబాబుదీ ప్రధానపాత్రే. హత్యలో భాగస్వామ్యముండీ మిగిలిన వాళ్ళను మాత్రమే హంతకులగా వర్ణించటం చంద్రబాబుకే చెల్లింది. అధికారంలో ఉన్నంత వరకూ ఎన్ని మాటలైనా చెబుతారు.

‘వ్యక్తిని హత్య చేసి పూలదండ వేస్తే చేసిన పాపం పోతుందా’...ఇది రాష్ట్ర విభజనపై చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్య. పై వ్యఖ్య చూస్తుంటే చంద్రబాబునాయుడుకు ఏమో అయిందని అనుమానంగా ఉంది. ఈ మధ్యలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా మాట్లాడుతున్నారు. బహుశా వయస్సు ప్రభావం కావచ్చేమో.

ఎక్కడైనా మంచి జరిగితే తనకు సంబంధం లేకపొయినా తన ఘనతగా చెప్పుకుంటారు. అదే, తప్పు జరిగితే ఎదుటివారిమీద తోసేయటం అలవాటైపోయింది. తాజాగా రాహూల్ గాంధి సభపై చంద్రబాబు మాటలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది అందరికీ. ప్రత్యేకహోదా డిమాండ్ తో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటూరులో వామపక్షాలు, జనతాదళ్, సమాజ్ వాదిపార్టీ నేతలతో బహిరంగసభ జరిగింది.

ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర విభజనను ధ్రౌపది వస్త్రాపహరణంతో పోల్చారు. ధ్రౌపదీ వస్త్రాపహరణంకు, రాష్ట్ర విభజనకు ఏంటి సంబంధమో చంద్రబాబే చెప్పాలి. రాష్ట్ర విభజనకు సూత్రధారి చంద్రబాబే అన్న విషయం అందరికీ తెలిసిందే. విభజనకు రెండుసార్లు లేఖలు ఇచ్చి ఇపుడు తనకే పాపం తెలీదని అనటం విచిత్రంగా ఉంది.

విభజన సమయంలో అప్పుడు సభలో ఉన్న నాయకుడు కానీ పార్టీ కానీ ఎవ్వరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. విభజనకు తొలి ఓటు వేసిందే టిడిపి అంటూ తెలంగాణా పర్యటనల్లో చంద్రబాబే ఎన్నోమార్లు చెప్పారు. పైగా వ్యతిరేకించింన నరసరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డిని చొక్కా చింపేసి కొట్టింది తెలంగాణాలోని ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర్ రావు కాదా? ఇద్దరూ టిడిపి ఎంపిలే కదా?

విభజనను ఆపాలంటూ శరద్ యాదవ్, మమతా బెనర్జీ, శివసేన, వామపక్షాల నేతలను కలిసానంటున్నారు. ప్రతిపక్షాలను కలిస్తే ఏంటి ఉపయోగం? అధికారంలో ఉన్న కాంగ్రెస్అధినేత సోనియాగాంధిని ఎందుకు కలవలేదు? విభజనకు మద్దతుగా రెండుసార్లు తానిచ్చిన రెండులేఖలను ఎందుకు ఉపసంహరించుకోలేదు? లేఖలను ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఎంత అడిగినా అంగీకరించలేదుకదా?

పైగా విభజనకు సహకరించిన భాజపాతో ఎన్నికల సమయంలో పొత్తు ఎలా పెట్టుకున్నారు? రాష్ట్ర విభజనను చంద్రబాబు హత్యతో పోల్చటం మరీ విచిత్రంగా ఉంది. రాష్ట్ర విభజన నిజంగా హత్యే అయితే, జరిగిన హత్యలో చంద్రబాబుదీ ప్రధానపాత్రే. హత్యలో భాగస్వామ్యముండీ మిగిలిన వాళ్ళను మాత్రమే హంతకులగా వర్ణించటం చంద్రబాబుకే చెల్లింది. అధికారంలో ఉన్నంత వరకూ ఎన్ని మాటలైనా చెబుతారు.

click me!