శ్రీశైలంలో గొల్లభామ మంటపం ఇలా పడి ఉంది ముక్కలై...

Published : Jun 04, 2017, 04:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
శ్రీశైలంలో గొల్లభామ మంటపం ఇలా పడి ఉంది ముక్కలై...

సారాంశం

శ్రీశైలంలో కళాత్మకమయిన గొల్లభామ దేవాలయం  రిజర్వాయర్ నీటి ముంపు ప్రదేశంలో ఉన్నందువలన దానిని అక్కడినుండి విడదీసి, భాగాలను మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర పడేశారు. అవి పనికిరాని రాళ్లమాదిరి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి. కొన్ని మాయమై పొయాయి.  గొల్లభామ మంటప పునర్నిర్మాణం దేవాదాయ శాఖ నిర్ణయించిన స్థలంలో, నీటి పారుదల శాఖ ఆర్థిక  సాయంతో, పురాతత్వ శాఖసాంకేతిక పర్యవేక్షణలో జరగాలి.దశాబ్దాలైనా జరగడం లేదు.

 

 నల్లమల కొండల మధ్య,  కృష్ణా నది కుడి ఒడ్డున 12 జ్యోతిర్లింగాలలొ ఒకటి (మల్లికార్జున), 18 శక్తి పీఠాలలొ ఒకటి (భ్రమరాంబ) ఒకే ప్రాంగణంలో కలిగిన ఏకైక పుణ్య క్షేత్రం శ్రీశైలం.

 

 20 వ శతాబ్దం మద్య భాగం వరకూ, ఇక్కడికి ఎక్కువగా కర్ణాటక మహారాష్ట్రలనుండి వీరశైవులు మాత్రమే యాత్రకు వచ్చేవారు. ఇప్పటికి వారికి శ్రీశైలమే కాశి. జీవితములొ ఒక సారైనా ’మల్లయ్య’ ను చూస్తేనే మోక్షప్రాప్తి అనేది వాళ్ళ అచంచల నమ్మకం. అప్పుడు శివరాత్రి, యుగాది సందర్భాలలో మాత్రమే యాత్రికుల రద్ది ఉండేది. మార్కాపురం, నంద్యాల, కర్నూలు రైల్వే నిల్దాణములలో వేలాది యాత్రికులు వచ్చి దిగేవారు. 1929 లొ అప్పటి మద్రాస్ రాష్ట్రం విధాన పరిషత్ సభ్యులుగానున్న గాడిచర్ల హరిసర్వొత్తమ రావుగారు, ఆప్త మిత్రులు,  కంభం శరభారెడ్దిగారి చొరవతో దోర్నాలనుండి కంకర రస్త నిర్మాణం చెయించి బస్సుల రాక పోకలకు సౌకర్యాన్ని కల్పించడంతో యాత్రికుల సంఖ్య గణనీయముగా పెరగడం మొదలయింది.  ఉగాదిలొ ఇప్పటికి వేలాది మంది, అబాల గోపాలం కాలి నడకతొ, దక్షిణ మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకనుండి, వందలాది కి.మీ. నడిచి వస్తుంటారు.  వారితో పాటు ప్రస్తుతం దేశం నలుమూలనుంచి కూడా మల్లికార్జునుని దర్శనార్థం, అన్ని కాలాలలో భక్తులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలలో తిరుపతి తరువాతి స్థానం శ్రీశైలానిదే. 

        శ్రీశైలంలొ దర్శించవలసిన చారిత్రిక, పర్యాటక, సాంస్కృతిక, విశిష్ట స్థలాలు సాక్షి గణపతి, ఆది శంకరులవారు తపస్సు చేసిన పాలదార, పంచదార, చెంచులక్ష్మిగిరిజన ప్రదర్శన శాల, శివాజి స్మారక కేంద్రం, హటకేశ్వరం, కదళీవనం,  పాతాళ గంగ. ప్రతి  స్థలానికి, దానిదైన ప్రత్యేకత ఉంది. ఉదా: దేవాలయానికి 8 కీ.మీ. దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ "శిఖరం" పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే,  పునర్జన్మ నుండి విముక్తులవుతారు అన్న అనాది నమ్మకాన్ని ఇంచు మించు భక్తులందరూ పాటిస్తారు,శిఖరం వద్ద భక్తులు.

 

భక్తాదులందరూ అనాదినుండి పాటిస్తూ వచ్చిన ఒక సంప్రదాయం: "పాతాళ గంగ"నుండి కృష్ణా నది నీళ్ళతో మల్లికార్జునుకి అభిషేకం చేయడం.  శ్రీశైలం ప్రక్కనే కృష్ణా నది ప్రవహిస్తుంది. శ్రీశైలం చాలా ఎత్తులో ఉంటుంది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ ’పాతాళ గంగ” అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు, పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది.  అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.   2004 లో పాతాళగంగకు వెళ్ళేందుకు  రోప్ వే ఏర్పాటు చేయబడింది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి. పాతాళ గంగకు, క్రి.శ 1335 నుండి క్రి.శ 1400 మధ్య కాలములో రెడ్దిరాజు ప్రొలయవేమా రెడ్ది మరియు విజయనగర  రెండవ హరిహర రాయలు కృష్ణా కుడివైపునుండి; వెలమ దొర, మండనాయక ఎడమ (తెలంగాణా) వైపు నుండి పాతాళగంగకు మెట్ళు కట్టించినట్ళు వివిధ శాసనాల ద్వారా తెలిసింది. 

 

పాతాళ గంగలో విజయనగర రాజులైన శ్రీ కృష్ణదేవరాయలు, అచ్యుత రాయలవారు అరుదైన, అందమైన,  విజయనగర శైలిలొ కట్టించిన,  గొల్లభామా మండపం, మహబూబ్ నగర్ జిల్లాలోని ఉమామహేశ్వర దేవాలయం కోవకు చెందినది. శివ పార్వతులు ఒకే వేదికపై కూర్చున్న విగ్రహం  దేవాలయంలో ఉంది.  వారి ఇరువైపుల గణపతి, కింది వరుసలోనందీశ్వరుడు కనిపిస్తారు.  శివుని రెండు  చెతులలొ  ఆయుధాలు- ఒక చేయి అభయం చూపుతూ, ఇంకొకటి, పార్వతి వీపుపై ఉంచుతు శివుడు కనిపిస్తాడు. ఎడమ కాలు మడచుకొని ఆసనపై పెట్టుకొని, కుడి కాలు, కిందికి ఊగుతూ ఉంటుంది.   విభూతి,  యజ్నోపవీతాది అలంకారములతో ఉన్న విగ్రహంలో శివుని ఎడమ తొడపై పార్వతి రెండు కాళ్లు కిందికి ఊపుతూ ఆసీనులై ఉంటుంది. కుడి చేయి శివుని మెడపై ఉంచి, ఎడమ చై కిందికి ఊగుతూ ఉంటుంది.  విష్ణు అనుగ్రహ , త్రిపురాంతక, నటరాజ, సోమస్కంద, వ్రసవాహన, ఇత్యాది మూర్తులు, గోడకు చెక్కిఉంటాయి.

గోల్లభామ మంటపం

             

  దేవాలయ నిర్మాణం గురించి ఒక చిన్న ఉదంతం. శ్రీశైల మల్లన్నకు  చంద్రావతి, అక్కమహాదేవి,వల్లీ దేవీ, హెమరెడ్ది మల్లమ్మ,  అలాంటి చాలా భక్తురాలు ఉండేవారు. అందులో యాదవ కులానికి చెందిన, రోజూ పూజ చేస్తూ, రాగయుక్తంగా పాటలు పాడుతూ ఉండిన గొల్లభామ (వల్లిదేవి) చాందసురాలు.  శ్రీకృష్ణ దేవరాయలవారు గొల్లభామ స్మారకార్థం దేవాలయ నిర్మాణం మొదలు పెట్టారు. దానిని వారి తమ్ముడు అచ్యుతరాయలవారు పూర్తిచేశారు. ఇది భక్తాదులకొరకై నిర్మించినది. ఆ నాటినుండి భక్తాదులు, రెండు కి.మీ. దూరములొని పాతాళ గంగలొ స్నానం చేసి,  మల్లికార్జునుని అభిషేకానికి,  నీళ్ళు తెచ్చి అభిషేకం చేసే సంప్రదాయాన్ని, శ్రీశైలం ఆన కట్ట తయారయి, ప్రాజెక్టు నిండి పాతాళగంగ ముంపుకు గురి అయిన  1980 కాలంవరకూ పాటిస్తూ వచ్చారు. మల్లికార్జున స్వామి  దేవాలయం ఈశాన్య వైపున పాతాళ గంగకు నడుకదారి ఉంది.  గొల్లభామ దేవళం పాతాళ గంగ మేట్లన్నీ దాటిన తరువాత ఉండేది.  400 అడుగుల విస్తీర్ణములొ, 16’ X 25’  మంటపంతో, 16 X 16 గర్భగృహము, 3’ ఎత్తులో అధిష్టానం, 16 X 10’ విస్తీరణంలొ  ముఖ మంటపం,  నాలుగు స్థంభాలతో   కట్టించిన చిన్నదేవాలయం,  గొప్ప చరిత్రగల దేవాలయం ఇది. విజయనగరం శిల్ప శైలికి ఉన్నతమైన ఉదాహరణ.  ఈ దేవాలయంలోని  చాలా అంశాలు అనంతపురం జిల్లా,  తాడపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ దేవాలయం, గుంటూరు జిల్లా కొండవీడులొని శివాలయంతో పోలి ఉంటుంది.

                  ఇక్కడ గమనించవలసినది: విజయనగర రాజులందరూ, వైష్ణవులు. రాయలవారి రాజ గురువు, వ్యాసరాజ; మధ్వ సిద్దాంత ప్రవక్త!  హంపి గ్రామదేవత; వీరూపాక్ష!.  వారందరూ అన్ని కులాలనూ, మతాలనూ సమాన దృష్టితొ చూస్తూ, మత సామరస్యం సాధించారు. 1420 లో రచించిన "కర్ణాటక భారత కథా మంజరి” (గదుగు భారత) లో కన్నడ కవి కుమార వ్యాస, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి చాలా ఉదంతాలను, పరోక్షముగా ఇందులో పొందుపరిచి ఉన్నాడు. అందులొ ద్రౌపది పెండ్ళికి, వైదికులతో పాటు, బుద్ధ, జిన, యౌవన, లింగి,  ఇతర వర్గాలవారు  కూడా వచ్చినట్ళు వివరిస్తాడు. వ్యాస భారతం నాటికి వారంతా లేరుగదా !! 

 

 

             ఇదిలా ఉండగా,   బ్రిటిష్ ప్రభుత్వం  కృష్ణ నదిపై సిద్దేశ్వరం, నందికొండ మరియు పులిచింతలలొ ఆనకట్టలు  కట్టడానికి, హైదరాబాద్ నవాబ్ తొ ఒప్పందం కుదురుచుకొనే ప్రయత్నం చేశారు. స్వాతంత్రం వచ్చి, 1953 లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు ఆయిన తరువాత, నందికొండ పేరు మార్చి నాగార్జునసాగర్, సిద్దేశ్వరం స్థలం మార్చి శ్రీశైలంలో  ప్రాజక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో  అనుమతి పొందారు.                  

           1963, జులై, 24 న ప్రధాని పండిత్ జవాహరలాల్ నెహ్రూ  శ్రీశైలం అనకట్టకు శంకుస్థాపన చేశారు. అంతకు  ముందు రోజు తెల్లవారుజామన  ఆయన ప్రత్యేక రైలులో హైదరాబాద్ నుండి కర్నూలు చేరుకొన్నారు. వెంటనే ఉదయం  కర్నూలునుండి బయలుదేరి, ఓపెన్ టాప్ జీప్ లో  కర్నూలు పొలిమెర వరకు వచ్చారు.  రాస్తాకు ఇరువైపుల ఉన్న గాంధీ టోపి ధారులైన విద్యార్థులతో (నాతో సహా - నేను కర్నూలు ఉస్మానియా కాలేజు విద్యార్థి)  చేతులు కల్పుకొంటూ, ఊరు దాటిన తరువాత కారు ఎక్కి పోయినారు. వరుసలో, మూడో, నాలుగో కార్లు. ప్రధాన మంత్రిగారికి కూడా హెలికాప్టర్ సంస్కృతి లేని యుగమది. 23-7-1963 సాయంకాలం, ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్దిగారితొ కలిసి, శ్రీశైలం మల్లికార్జున, భ్రమరాంబల దేవాలయం సందర్శించారు.   దేవాలయం మహాద్వారందగ్గర వారికి దేవాదాయ శాఖామాత్యురాలు, శ్రీమతి టి.ఎన్, సదాలక్ష్మి, కమిషనర్ పైడి లక్ష్మయ్య, అర్చకుల చేత, పూర్ణ కుంభం , ఇతర ఆలయ మర్యాదాలతో స్వాగతం  పలికారు.  తరువాత నెహ్రూ, దేవాలయ శిల్పకలా కౌశల్యాల గురించి స్థపతులతో వివరాలు తెలుసుకొన్నారు. ( ఆంధ్ర పత్రిక, జులై, 25,1963). తరువాత నెహ్రూ ముంపు ప్రాంతాలలొని ప్రజల, ఆస్థి, ఇతర వివరాలతొ పాటు, దేవాలయాలు ఇన్నితర, పురాతత్వ నిర్మాణాల, పునరావాస గురించి సంజీవ రెడ్డిగారితోనూ, వారి మంత్రివర్గ సహచరులతోనూ, అడిగి తెలుసుకొన్నారు. 

            చాలా దేవాలయాలను, అలంపూర్, కర్నూలు, కొల్లాపూర్, జతప్రోలు తదితర ప్రాంతాలలొ పునర్నిర్మాణం చేశారు.  ఈజిప్ట్ లో , నైల్ నదికి అడ్దముగా, అస్వాన్ ఆనకట్ట కడుతున్నపుడు ముంపుకు గురియయ్యె, పిరమిడ్ లను తొలగించి పునర్నిర్మాణం చేశాక, ఇలాంటి ప్రయత్నం మరొకసారి జరగడం ఇక్కడే.

ఈ ప్రాశస్త్యాన్ని తెలుసుకొన్న కన్నడ పరిశోధకులు, జ్ఞానపీఠ విజేత డా.కోటాశివరామ కారంత  తన ఎనభైవ వయస్సులో  మూడు సార్లు ఇక్కడ వచ్చి అధ్యయనం చేసి కొన్ని పరిశోధనాత్మక వ్యాసాలను కన్నడలో చేశారు.    

 

                    గొల్లభామ దేవాలయం కూడా ముంపుప్రదేశంలో ఉన్నందువలన దానిని అక్కడినుండి విడదీసి, భాగాలను మల్లికార్జున దేవాలయం దగ్గర ఉంచారు. అవి పనికిరాని రాళ్లమాదిరి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి. కొన్ని మాయమై పొయాయి.  గొల్లభామ మంటప పునర్నిర్మాణం దేవాదాయ శాఖ నిర్ణయించిన స్థలంలో, నీటి పారుదల శాఖ ఆర్థిక సాయంతో, పురాతత్వ శాఖ సాంకేతిక పర్యవేక్షణలో జరగాలి.  ఈ మూడు శాఖలవారి అభిరుచి, శ్రద్ధంతా రాత కూతలకే పరిమితమై ఉండడం శోచనీయం. ఇది కేవలం, ఈ మూడు శాఖలవారి భాధ్యత. అదొక జాతీయ సంపద. పరి రక్షించవలసినవారు భాధ్యతారహితంగా వ్యవహరిస్తే, జాతి, ముందు తరం వారిని క్షమించదు. మనం వారసత్వంగా స్వీకరించిన సంపత్తును, ఇంకా సమృద్ధం చేసి, ముందు తరానికి అప్పజెప్పాలి. అదికాకపోతె అలాగేనైనా వదలిపెట్టాలి. దానిని దోపిడికి గురిచేసి, నాశనం చేసె హక్కు మనకు లేదు. పై మూడు శాఖలవారు సత్వర చర్యలు తీసుకోవాలి. ఇలా కాకపోతే, భక్తాదులు,  ప్రాచీన చరిత్ర అభిమానులు  చట్ట రీత్యా చర్యలేగాక, ప్రజాస్వామ్య పద్దతిలొ  ఆందోళనకు దిగే అవకాశం  లేక పోలేదు. 

 

 

(*డా.చంద్రశేఖర రెడ్డి(పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీశైలం పీఠం, చరిత్ర విభాగం ఆచార్యులు; కురాడి చంద్రశేఖర కల్కూర, అధ్యక్షులు, ఆం.ప్ర,గ్రంథాలయ సంఘం, కర్నూలు.)  

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu