ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండదు, త్వరలోనే టీడీపీ అధికారంలోకి వస్తోందని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండదు, త్వరలోనే టీడీపీ అధికారంలోకి వస్తోందని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురువారం నాడు మహానాడులో వీడియో కాన్పరెన్స్ ద్వారా బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి బాలకృష్ణ ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబునాయుడు సాకారం చేస్తున్నారన్నారు. త్వరలోనే చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ అధికారంలోకి వస్తోందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
also read:కేసీఆర్ తో చిరంజీవి పెద్దల చర్చలు: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులను అందరూ చూస్తున్నారన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వస్తోందన్నారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న చాలా దారుణంగా ఉందన్నారు.
టీడీపీ కార్యకర్తలే ఎన్టీఆర్ కు వారసులని ఆయన చెప్పారు.తాము ఎన్టీఆర్ వారసులం కాదు. పార్టీ కార్యకర్తలే ఎన్టీఆర్ కు నిజమైన వారసులేనని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రపంచంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి ఉందన్నారు. టీడీపీకి కార్యకర్తలే నిధి అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎవరికీ కూడ భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉన్నా తాను ప్రత్యక్షమౌతానని ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ సమాధి వద్ద పూలమాలలు వేసి ఎన్టీఆర్ కు ఆయన నివాళులర్పించారు.