విశాఖ మెట్రో పనులు... ఆలస్యానికి కూడా అదే కారణం: జగన్ తో అధికారులు

By Arun Kumar PFirst Published May 28, 2020, 11:31 AM IST
Highlights

ఏఐఐబీ ఆర్థిక సహాయంతో 50 పట్టణ ప్రాంతాల్లో, లక్షజనాభాకన్నా తక్కువ ఉన్న టౌన్స్‌లో తాగునీటికోసం రూ. 5,212 కోట్లతో చేపట్టిన పనులపై దృష్టిపెట్లాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.

అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నడుస్తున్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమృత్‌ పథకం కింద దాదాపు రూ.3,762  కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో ఆర్థికంగా బలంగాలేని మున్సిపాల్టీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను అధికారులు ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాం నుంచి చాలారోజులుగా ఇది పెండింగులో ఉందని అధికారులు పేర్కొన్నారు. రూ.800  కోట్లరూపాయల గ్యాప్‌ను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, దీనికి ప్రభుత్వం తరపున గ్యారెంటీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం దీనికి అంగీకరించారు. 

అలాగే విజయవాడ, గుంటూరుల్లో చేపట్టిన  డ్రైనేజీ వ్యవస్థలను సత్వరమే పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. విజయవాడ కాల్వల్లోకి చెత్తవేయకుండా చూడాలని సీఎం ఆదేశించారు. విశాఖకు నిరంతర  తాగునీటి సరఫరా ప్రతిపాదనపై సమగ్ర కార్యాచరణ తయారు చేయించాలని సీఎం సూచించారు. స్మార్ట్‌సిటీ కింద రూ.4,578 కోట్ల విలువైన పనులు విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిల్లో చేస్తున్నారు. వాటిని వేగంగా పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఏఐఐబీ ఆర్థిక సహాయంతో 50 పట్టణ ప్రాంతాల్లో, లక్షజనాభాకన్నా తక్కువ ఉన్న టౌన్స్‌లో తాగునీటికోసం రూ. 5,212 కోట్లతో చేపట్టిన పనులపై దృష్టిపెట్లాలని సీఎం ఆదేశించారు. ఈ పట్టణాలకు వెళ్లేదారిలో ఉన్న 111 గ్రామాలకూ తాగునీరు అందించాలన్నారు. టిడ్కో ఇళ్ల పనులు వేగవంతం చేయాలని జులై 8న వారికి రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధంకావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

విశాఖపట్నం మెట్రో రైల్‌ డీపీఆర్‌ను త్వరగా సిద్ధంచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ కారణంగా కాస్త వెనకబడ్డామని, త్వరలోనే పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. 

లక్షదాటిన పట్టణాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకోసం ఉద్దేశించిన రూ.10,666  కోట్లతో కార్యక్రమాలకు సిద్ధంకావాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీలను మోడల్‌ మున్సిపాల్టీలుగా చేయడంపై సమీక్షించారు ముఖ్యమంత్రి. ప్రతిపాదనలను, అంచనాలను వివరించిన అధికారులు..30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. 100శాతం తాగునీటి సరఫరా, 100శాతం డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రతిపాదనలు రూపొందిచామన్నారు.  

read more  నా పిల్లల మీద పెడుతున్నపెట్టుబడే ఇవన్నీ...: విద్యారంగంపై మేదోమధనంలో జగన్

పాఠశాలల అభివృద్ది, నాడు–నేడు కార్యక్రమంలో చేపట్టిన పనులకన్నా.. మరింత ఆధునిక వసతులు సమకూర్చేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు. అలాగే జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు అర్బన్‌హెల్త్‌ సెంటర్ల నిర్మాణంపైనా ప్రతిపాదనలు రూపొందించామన్నారు. 

తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీల్లోని పేదలకు ఇళ్లనిర్మాణంపైనా  సమావేశంలో చర్చించారు. ఇళ్ల నిర్మాణం నాణ్యంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మంగళగిరి ఆలయ అభివృద్ధి, మాడ వీధుల పునర్నిర్మాణం పైనా సమావేశంలో చర్చించారు. బకింగ్‌ హాం కెనాల్‌ డెవలప్‌మెంట్, కాల్వల సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ది తదితర అంశాలపైన కూడా చర్చించారు. 

మంగళగిరిలో చేనేతలకు కాంప్లెక్స్‌ నిర్మాణం, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సమగ్ర కాంప్లెక్స్‌ నిర్మాణంపైనా ప్రతిపాదించారు అధికారులు. వీటన్నింటికీ జూన్‌నాటికి పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  బొత్స సత్యన్నారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

 

click me!