మే 3 తర్వాతే భక్తులకు వెంకన్న దర్శనంపై నిర్ణయం: ఈవో సింఘాల్

By narsimha lodeFirst Published Apr 30, 2020, 10:58 AM IST
Highlights

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో నిర్ణయం తీసుకొంటామని టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.

తిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో నిర్ణయం తీసుకొంటామని టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. మే 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు నిర్వహించే శ్రీపద్మావతి పరిణయోత్సవాలను వాయిదా వేసినట్టుగా చెప్పారు.

బుధవారం నాడు రాత్రి శ్రీవారి ఏకాంత సేవలో ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తూ టీటీడీ గతంలోనే నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. 

జూన్ 30వ తేదీ వరకు వెంకన్న దర్శనం భక్తులకు లేదని సోషల్ మీడియాలో సాగిన ప్రచారాన్ని టీటీడీ ఈవో సింఘాల్ ఖండించారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఏపీ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ తరుణంలో భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో ఇంకా  స్పష్టత రాలేదు.

also read:వెంకన్న దర్శనంపై సోషల్ మీడియాలో అసత్యప్రచారం: తేల్చేసిన టీటీడీ

మే 3వ తేదీ తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మే 1వ తేదీ నుండి 3 వతేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాల నిర్వహణకు కనీసం 70 మంది  అవసరం. ఈ తరుణంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ఉత్సవాలను వాయిదా వేశామన్నారు. ఈ ఏడాదిలో ఎప్పుడైనా ఈ ఉత్సవాలను నిర్వహించే అవకాశం ఉందన్నారు.
 

click me!