ఏపీలో ఉన్నతాధికారి భార్య మటన్ కోరిక.. గాలిలో కలిసిన అటెండర్ ప్రాణాలు

By telugu news teamFirst Published Apr 30, 2020, 9:47 AM IST
Highlights

ఓ ఉన్నతాధికారి భార్యకు మాంసం తినాలని కోరిక కలిగింది. ప్రస్తుతం లాక్ డౌన్ కదా .. దగ్గరలో వారికి మాంసం దొరకలేదు. దీంతో.. గన్నవరం వెళ్లి తీసుకురావాలని సదరు అధికారిణి భార్య.. అటెండర్ కి పురమాయించింది.

ఉన్నతాధికారులు ఏ పనులు చెప్పినా.. కింద ఉద్యోగులు సచ్చినట్లు చేయాల్సిందే. వాళ్లే కాదు.. వారి భార్యలు చెప్పిన పనులు కూడా చేయాల్సిందే. లేదంటే ఎక్కడ ఉద్యోగం పోతుందో అనే భయం. అందుకే చెప్పిన పని తూచ తప్పకుండా చేస్తుంటారు. ఇలా ఓ ఉన్నతాధికారి భార్య చెప్పిన పని చేయడానికి వెళ్లి.. ఓ అటెండర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి భార్యకు మాంసం తినాలని కోరిక కలిగింది. ప్రస్తుతం లాక్ డౌన్ కదా .. దగ్గరలో వారికి మాంసం దొరకలేదు. దీంతో.. గన్నవరం వెళ్లి తీసుకురావాలని సదరు అధికారిణి భార్య.. అటెండర్ కి పురమాయించింది.

గన్నవరం వెళ్లి రావడానికి కనీసం కారు కూడా సమకూర్చలేదు. దీంతో బైక్ పై వెళ్లడానికి ఆ అటెండర్ బయలు దేరాడు. అయితే విధి వక్రీకరించి ఓ పోలీసు వాహనం... బైక్‌ను ఢీకొనడంతో అటెండరు గాయపడ్డాడు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పరిధిలో జరగ్గా... అక్కడి పోలీసులు గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లుగా కేసు నమోదు చేయడం గమనార్హం.

కొన ఊపిరితో ఉన్న బాధితుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సుమారు 18 గంటలు అపస్మారక స్థితిలో ఉన్న అతనికి మంగళవారం అర్ధరాత్రి వరకు చికిత్సలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అటెండరు మరణం విషయాన్ని గోప్యంగా ఉంచారు.

ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. కుటుంబీకులను మేనేజ్‌చేసి గోప్యంగా ఉంచినప్పటికీ ఉద్యోగ వర్గాలు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చాయి. దీంతో ఈ వార్త తీవ్ర సంచలనం రేపింది.

మీడియా వర్గాలు ఈ విషయంపై ఒత్తిడి తీసుకురావడంతో అటెండర్ మృతి విషయాన్ని అంగీకరించారు. అయితే.. కేవలం తన  కుటుంబసభ్యులను కలవడానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యాడంటూ చెప్పాలని సదరు అటెండర్ కుటుంబసభ్యులను ఉన్నత వర్గాలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అమ్మవారి మాంసం కోరిక తీర్చబోయి.. అతను ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలచివేస్తోంది. అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

click me!